గైనెస్‌విల్లే (యూఎస్): అమెరికాలోని జార్జియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ చిన్న ఫ్లైట్ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సింగిల్ ఇంజిన్ విమానం అయిన హాకర్ బీచ్‌క్రాఫ్ట్ బీఈ-36లో ఇంజన్లో సమస్య ఏర్పడిన కారణంగా.. సోమవారం అట్లాంటాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గైనెస్‌విల్లేలోని బ్రౌన్స్ బ్రిడ్జ్ రోడ్‌లో మూడు కార్లను ఢీకొట్టి ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, గైనెస్‌విల్లే పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పైలట్ థామస్ రోజర్స్ మాట్లాడారు. "గైనెస్‌విల్లే నుంచి మా ఇంజిన్ టేకాఫ్ అవ్వడం మానేసింది. మేము వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించాము. రూల్‌బుక్ ప్రకారం ప్రతిదీ చేశాము. కానీ, మేము తిరిగి వెళ్లలేమని గ్రహించాము. దీంతో రోడ్డుపై అత్యవర ల్యాండింగ్ చేశాము” అని వెల్లడించారు.
విమానం మూడు కార్లను ఢీకొట్టిందని.. వాటిలో ఒకదానిలో ఫ్యూయల్ ట్యాంక్ పడిపోయిందని గైనెస్‌విల్లే పోలీసు కెప్టెన్ కెవిన్ హోల్ బ్రూక్ చెప్పారు. ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వందలాది వాహనాల మధ్యలో దిగినప్పటికీ, మూడు కార్లనే ఫ్లైట్ ఢీకొట్టిందని, ఆ ఏరియాలో విద్యుత్ లైన్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని హోల్ బ్రూక్ చెప్పారు.
