చిన్న టూల్స్ చేసే​పెద్ద పనులు

చిన్న టూల్స్ చేసే​పెద్ద పనులు

లగేజ్​ బ్యాగ్​ని మెట్ల మీద నుంచి పై ఫ్లోర్​కి తీసుకెళ్లడం, కూల్​డ్రింక్​ సీసా మూత తెరవడం, కార్టన్​ పార్శిల్​ ఓపెన్​ చేయడం లాంటివి అనుకోవడానికి చిన్న పనులే.. కానీ, వాటికి తగ్గ టూల్స్ లేకపోతే విసుగు తెప్పిస్తాయి. అందుకే ఇంట్లో కొన్ని స్మార్ట్​ టూల్స్​ తెచ్చుకోవాలి. అవేంటంటే.. 

వ్యాలెట్​ నింజా

ఈ టూల్​ చూడడానికి క్రెడిట్​ కార్డ్​ సైజులో ఉంటుంది. కానీ, ఇది చాలా రకాల పనులు చేస్తుంది. ఇది వ్యాలెట్​లో ఉంటే కనుక మొత్తం 18 టూల్స్​ మన దగ్గర ఉన్నట్టే. ఈ స్పైడర్​ జ్యూస్​ క్రియేటివ్​ వ్యాలెట్​ నింజా మల్టీ-టూల్​లో ఆరు రెంచ్‌‌లు, నాలుగు స్క్రూ డ్రైవర్లు, రెండు రూలర్లు ఉంటాయి. దీనిని సెల్‌‌ఫోన్ స్టాండ్​గా కూడా వాడుకోవచ్చు. బాటిల్ క్యాప్​ ఓపెన్​ చేయొచ్చు. కార్టన్​ బాక్స్​, లెటర్ ఓపెనర్​గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఇన్​బిల్ట్​గా ఫ్రూట్ పీలర్​ కూడా ఉంటుంది. కళ్లద్దాలకు ఉండే చిన్న స్క్రూలను కూడా దీంతో ఓపెన్​ చేయొచ్చు. ధర: 130 రూపాయలు.

పెన్​ స్క్రూ డ్రైవర్​

కొన్ని ఎలక్ట్రానిక్​ గాడ్జెట్స్​ని ఇంట్లోనే రిపేర్​ చేసుకోవచ్చు. కానీ.. వాటిని ఓపెన్​ చేయడమే కాస్త ఇబ్బంది. ఒక్కో గాడ్జెట్​కు ఒక్కో సైజు స్క్రూలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ పెన్​ కొంటే సరిపోతుంది. పెన్​తో స్క్రూలు ఓపెన్​ చేయడమేంటి అంటారా?.. ఇది పెన్నులా ఉండే స్క్రూ డ్రైవర్​ కిట్​. జాక్​మీ కంపెనీ దీన్ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీన్ని యాంటిస్లిప్, కాంపాక్ట్ పోర్టబుల్ డిజైన్​తో తయారుచేశారు. ఇందులో ఫిలిప్స్1.0, 4.0 బిట్లు, స్లాట్​డ్​ 2.0, 3.0 బిట్లు ఉంటాయి. వీటిని క్రోమియం, వెనీడియం ఉక్కుతో తయారుచేశారు. అందుకని ఎక్కువరోజులు పాడుకావు. తుప్పు కూడా పట్టదు. డీఐవై వస్తువులు, స్మాల్​ హోమ్​ అప్లయెన్సెస్​, అద్దాలు, వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివాటిని రిపేర్​ చేయడానికి ఉపయోగపడుతుంది. ధర: 299 రూపాయలు

అప్​కార్ట్​​

ఇల్లు మారేటప్పుడు ఎదురయ్యే పెద్ద ప్రాబ్లమ్​.. సామాన్లను మోసుకెళ్లడమే. లిఫ్ట్​ లేని బిల్డింగ్​లో పై అంతస్తుకి మారడమంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్​. ప్రతి వస్తువుని మెట్ల మీద నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లాలి. పైగా బరువులు మోస్తూ.. మెట్లు ఎక్కడం అంత ఈజీ కాదు. అయితే.. ఇలాంటి పనులను ఈజీగా చేయడానికి అప్​కార్ట్​ అనే కంపెనీ హ్యాండ్​ ట్రక్​ని మార్కెట్​లోకి తెచ్చింది. దీనిపై వస్తువులను పెట్టి మెట్ల మీది నుంచి లాక్కెళ్లొచ్చు. దీనికి రెండు వైపులా మూడు చక్రాలు ఉంటాయి. ఫర్నిచర్, వాషింగ్ మెషిన్, చిన్న సైజ్​ ఫ్రిజ్​, కూలర్​ లాంటివాటిని దీనిపై ఈజీగా తీసుకెళ్లొచ్చు. తేలికైన అల్యూమినియం ఫ్రేమ్​తో తయారైంది ఇది. కాబట్టి బరువు కూడా తక్కువే. ఇది మామూలుగా మోసుకెళ్లడంతో పోలిస్తే.. 64 శాతం శ్రమను తగ్గిస్తుంది. ధర: 6,000 రూపాయలు

ఐ ఫోన్​ ప్రింట్​ పాకెట్​

ఇదివరకు ఫొటో తీయగానే ప్రింట్​ బయటికి వచ్చే ఇన్​స్టంట్​ పొలరాయిడ్​ కెమెరాలను బాగా వాడేవాళ్లు. అదే టెక్నాలజీతో ఇప్పుడు ప్రింట్​ పాకెట్​ మార్కెట్​లోకి వచ్చింది. కాకపోతే.. ఇది కెమెరా కాదు. ఐ ఫోన్​కు కనెక్ట్​ చేస్తే.. ఇన్​స్టంట్​ కెమెరాగా మారిపోతుంది. దీన్ని మొబైల్​కి కనెక్ట్‌‌ చేసుకుని ఫొటోలు ప్రింట్​ తీసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రింట్​ క్యాట్రిడ్జ్‌‌లా పనిచేస్తుంది. 30 సెకన్లలోనే ఫొటోను ప్రింట్​ చేస్తుంది. ఇందులో ఇంక్ ఫిల్​ చేయాల్సిన అవసరం కూడా లేదు. జీరో ఇంక్​ స్టిక్కర్​ పేపర్​ మీద ప్రింట్​ తీసుకోవచ్చు. ధర: 18,000 రూపాయలు