దునియాలనే చిన్న ఫ్లైట్​.. పెద్ద ఎలక్ట్రిక్​ బండి

దునియాలనే చిన్న ఫ్లైట్​.. పెద్ద ఎలక్ట్రిక్​ బండి

ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానం. 13 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 81 కిలోల బరువు ఉంటుంది అంతే. ‘రెక్కల బబుల్​ కార్​’ అని ముద్దుగా పిలుస్తున్న ఈ విమానం అసలు పేరు కొలంబన్​ జెట్​ క్రి క్రి. విమానం కన్నా దీని రెక్కలే పెద్దగా ఉంటాయి. వాటి వెడల్పు 17 అడుగులు. రెండు పీబీఎస్​ టీజే20ఏ టర్బోజెట్​ ఇంజన్లతో ఇది గాల్లోకి ఎగురుతుంది. 5000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఒక్కరంటే ఒక్కరే పట్టే ఈ బుల్లి విమానాన్ని బోయింగ్​ 747 వంటి పెద్ద పెద్ద విమానాలను 50 ఏళ్ల పాటు అలవోకగా నడిపిన బ్రిటన్​ రిటైర్డ్​ పైలట్​ బాబ్​ గ్రిమ్​స్టెడ్​ (70) నడిపారు. దాంతో స్టంట్లు చేశారు. దక్షిణాఫ్రికా ఇంజనీర్లు సాకీ వాన్​ హీర్దెన్​, డేవీ బోట్స్​లు తయారు చేసిన ఈ విమానం ధర జస్ట్​ 14.45 లక్షలు (21 వేల డాలర్లు).

పెద్ద ఎలక్ట్రిక్​ బండి.. చెత్త డంప్​ చేస్తదండి!

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్​ వాహనం. అదేనండి.. కరెంట్​ బండి. చెత్త, క్వారీ మట్టి, రాళ్లను డంప్​ చేసే ‘ఈడంపర్​’ ఇది. ఫుల్లు లోడ్​ ఉన్నప్పుడు 110 టన్నుల (లక్షా పది వేల కిలోల) బరువుంటుంది. మరి, అంతపెద్ద బండిని లాగాలంటే దాని బ్యాటరీలు కూడా అంత శక్తిమంతంగానే ఉండాలి కదా. అందుకే 4.5 టన్నుల ఎలక్ట్రిక్​ బ్యాటరీలను అందులో పెట్టారు. స్విట్జర్లాండ్​లోని బీల్​కు చెందిన కుహ్న్​ ష్వీజ్​ ఏజీ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. దాని టైర్లే 6 అడుగుల ఎత్తుంటాయి. అంటే ఓ పొడగరి సైజన్నమాట. దీనిలోని ఇంకో విశేషమేంటో తెలుసా..? బ్రేకులు వేసినప్పుడల్లా కరెంట్​ పుడుతుంది. ఆ కరెంట్​ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది. అంటే బయటి చార్జింగ్​తో పాటు ఇలా పునరుత్పాదక కరెంట్​తోనూ బ్యాటరీ చార్జ్​ అవుతుందన్నమాట. లోడ్​ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా కరెంట్​ పుడుతుందట. ఏటా 50 వేల టన్నుల డీజిల్​ ఆదా చేస్తూ, కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ను ఏటా 13 లక్షల కిలోలదాకా తగ్గిస్తుందట.