ఓటర్లకు ‘స్మార్ట్’ పేమెంట్లు.. క్యాష్ కో ఆర్డినేటర్స్​ను నియమించుకున్న అభ్యర్థులు

ఓటర్లకు ‘స్మార్ట్’ పేమెంట్లు.. క్యాష్ కో ఆర్డినేటర్స్​ను నియమించుకున్న అభ్యర్థులు
  • జనసమీకరణలో లోకల్ లీడర్స్ బిజీ
  • ఫోన్ పే, గూగుల్ పేతో పేమెంట్లు.. ఆన్​లైన్ ట్రాన్సాక్షన్లపై పోలీస్ నిఘా

హైదరాబాద్‌, వెలుగు: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు టెక్నా లజీని ఉపయోగించుకుంటున్నారు. క్యాష్ జోలికి వెళ్లకుండా ఆన్‌లైన్‌ పేమెంట్స్​తో పనులు చక్కబెట్టేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‌, పోలీసులకు చిక్కకుండా తక్కువ టైమ్​లో.. ఎక్కువ మందికి ఆన్​లైన్ పేమెంట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రతి అభ్యర్థీ స్పెషల్ టీమ్స్​ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్​లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలాంటి వారిపై ఇంటెలిజెన్స్, ఎస్​బీ స్పెషల్ టీమ్స్ నిఘా పెట్టాయి. ఆన్​లైన్ పేమెంట్లు చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల వివరాలు సేకరిస్తున్నాయి. పూర్తి ఆధారాలతో ఎన్నికల కమిషన్​కు నివేదిక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆన్​లైన్ పేమెంట్లు చేసేందుకు మండలం, గ్రామం, కాలనీల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులు క్యాష్ కో ఆర్డినేటర్స్​ను నియమించుకున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహించే సభలు, సమావేశాలకు ఓటర్లను తరలిస్తున్నారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి లీడర్లు చైన్ సిస్టమ్​​తో పనిచేస్తున్నారు. వీరంతా ఓటర్లతో డైరెక్ట్‌ కాంటాక్ట్ అవుతున్నారు. సభలు, సమావేశాలకు వస్తున్న కార్యకర్తలకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పేమెంట్స్ చేసేస్తున్నారు.

ఒక్కో ఏజెంట్​కు వంద మంది బాధ్యత

లక్ష రూపాయలకు మించకుండా.. క్యాష్ కో ఆర్డినేటర్స్ ద్వారా ఏజెంట్స్ నెట్​వర్క్​కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్​ఫర్ అవుతున్నాయి. ఒక్కో ఏజెంట్ దాదాపు వంద మందికి పైగా ఓటర్లను గ్యాదర్ చేస్తున్నాడు. వాళ్లను సభకు తరలించేందుకు కార్లు, మీల్స్ ఏర్పాటు చేస్తున్నాడు. సభ కంప్లీట్ అయ్యాక ఇంటికి చేరే సమయానికి ఆన్​లైన్ పేమెంట్లు చేసేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ లేనివారికి క్యాష్ ఇచ్చేస్తున్నాడు. ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలింగ్ ముగిసే టైమ్​కి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టి.. సమాచారం సేకరిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.