
- మళ్లీ టాప్-5లో యాపిల్
న్యూఢిల్లీ: మనదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ సంవత్సరం మొదటి క్వార్టర్లో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ రిటైలర్లకు పంపిన (షిప్‌మెంట్) చేసిన యూనిట్ల సంఖ్య 4.84 కోట్లకు ఓమ్డియా తాజా స్టడీ తెలిపింది. దీని ప్రకారం.. ఈ వృద్ధి సంవత్సరం చివరి వరకు కొనసాగకపోవచ్చు.
జులై, ఆగస్టు నెలల్లో కొత్త ఉత్పత్తుల విడుదల, రిటైల్ ప్రోత్సాహకాలు, త్వరగా వచ్చిన పండుగ సీజన్ కోసం ముందుగానే ఇన్వెంటరీ తెచ్చుకోవడం వంటి కారణాల వల్ల ఈ కొద్దిపాటి వృద్ధి సాధ్యపడింది. ఈసారి వివో (ఐకూ మినహా) 9.7 మిలియన్ యూనిట్లతో మార్కెట్‌లో తన హవాను కొనసాగించింది. దీని మార్కెట్వాటా 20 శాతానికి పెరిగింది.
శామ్సంగ్ 6.8 మిలియన్ యూనిట్లతో (14 శాతం వాటా) రెండో స్థానంలో ఉంది. షియోమీ, ఒప్పో (వన్ప్లస్ మినహా) రెండూ 6.5 మిలియన్ యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. చిన్న నగరాల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా యాపిల్ 4.9 మిలియన్ యూనిట్లతో టాప్ ఫైవ్‌లోకి తిరిగి వచ్చింది. యాపిల్ ఈ క్వార్టర్లో 10 శాతం వాటా సాధించింది.