నీళ్లు, నిధులు, నియామకాలను .. కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: స్మృతి ఇరానీ

నీళ్లు, నిధులు, నియామకాలను .. కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: స్మృతి ఇరానీ

దుబ్బాక, వెలుగు: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం దుబ్బాకలో నిర్వహించిన నారీ శక్తి వందన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రూ.40 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు​ వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచి నిధులు కాజేశారని,  మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణపై రూ.5 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంది. నిరుద్యోగులకు కొలువులు ఇవ్వలేదు.  కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదు. కానీ మోదీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రాష్ట్రంలో 35 లక్షల మంది  రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ జేసింది. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ వైపు ఉండాలా? దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్న మోదీ వైపు ఉండాలా? అన్నది ప్రజలు తేల్చుకోవాలి” అని అన్నారు. దళిత బంధు తదితర స్కీమ్‌‌లలో 30 % కమీషన్లు తీసుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు.

గల్లీలో కొట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఢిల్లీలో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్దిపేటకు రైలు తెచ్చిందని, రూ.1,600 కోట్లతో నేషనల్ హైవే పనులు చేపట్టిందని, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి రైతులకు  యూరియా కొరత తీర్చిందన్నారు. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, మోదీ ఇచ్చిన కరోనా వ్యాక్సిన్‌‌ను రాహుల్, కేసీఆర్​కూడా వేసుకున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. దుబ్బాకలో మరోసారి రఘునందన్​ను గెలిపించాలని కోరారు.