ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్.. హైదరాబాద్‌ టూ ఆస్ట్రేలియా స్మగ్లింగ్!

ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్.. హైదరాబాద్‌ టూ ఆస్ట్రేలియా స్మగ్లింగ్!
  • బేగంపేట్‌ నుంచి ఆస్ట్రేలియాకు కార్గోలో తరలించే యత్నం 
  • 22 ఫ్రేమ్​లలో 14.2 కిలోల సూడోఎఫిడ్రిన్‌ సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు:  ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్ ను దాచి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నిషేధిత సూడోఎఫిడ్రిన్‌‌ డ్రగ్‌‌ను బేగంపేట్ నుంచి ఆస్ట్రేలియాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నార్త్​ జోన్‌‌ పోలీసులు గురువారం పట్టుకున్నారు. 22 ఫొటో ఫ్రేమ్​లలో ప్యాక్ చేసిన14.2 కిలోల డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పార్సిల్​బుక్‌‌ చేసిన వారి కోసం గాలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు పార్సిల్‌‌ కౌంటర్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను చెక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఫ్రేమ్​లలో లేయర్లుగా ఫిక్స్ చేసి.. 

బేగంపేట్‌‌లోని యునైటెడ్‌‌ ఎక్స్​ప్రెస్‌‌ ఇంటర్నేషనల్ కొరియర్ అండ్‌‌ కార్గో సర్వీసెస్‌‌లో రెండు పార్సిల్ బాక్సులను నిందితులు బుక్‌‌ చేశారు. ఇందుకోసం తమిళనాడుకు చెందిన గణేషన్ పెరుమాల్‌‌, రఘునాథ్‌‌ శరవణన్ పేరుతో ఉన్న ఫేక్ ఆధార్‌‌‌‌ కార్డులను ప్రూఫ్​గా ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని డెలివరీ అడ్రస్‌‌ ఇచ్చారు. డైరెక్టరేట్‌‌ ఆఫ్‌‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌ అందించిన సమాచారంతో అలర్ట్ అయిన బేగంపేట్‌‌ పోలీసులు గురువారం కార్గో సర్విసెస్‌‌‌‌లో సెర్చ్ చేశారు. అనుమానం రావడంతో 2 పార్సిల్‌‌ బాక్సులను ఓపెన్ చేయగా, ఒక్కో బాక్సులో11 ఫొటో ఫ్రేమ్​లు, వాటికి సంబంధించిన గ్లాస్‌‌, ఉడెన్‌‌ ప్యాక్‌‌ మధ్యలో అమర్చిన ప్లాస్టిక్ కవర్లను గుర్తించారు. ఫ్రేమ్​ల మధ్య లేయర్‌‌‌‌గా ఫిక్స్‌‌ చేసిన డ్రగ్‌‌ పౌడర్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏడాదికాలంలో డీఆర్ఐ పరిధిలో ఇలాంటివి 15 కేసులు నమోదయ్యాయి. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు సీ కార్గో, ఎయిర్‌‌‌‌ కార్గోల‌‌ ద్వారా తరలిస్తున్న 300 కిలోలకు పైగా ఎఫిడ్రిన్‌‌, సూడోఎఫిడ్రిన్‌‌ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.