స్టైల్ మార్చిన స్మగ్లర్లు: ముందూ వెనకా ఎస్కార్ట్ తో గంజాయి స్మగ్లింగ్​

స్టైల్ మార్చిన స్మగ్లర్లు: ముందూ వెనకా ఎస్కార్ట్ తో గంజాయి స్మగ్లింగ్​

8 మంది అరెస్ట్​.. మరొక నిందితుడి కోసం గాలింపు

300 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయి స్మగ్లింగ్​

హైదరాబాద్​, వెలుగు: డీసీఎం నిండా ‘సరుకు’.. ఆ సరుకు ఎవరి కంటా పడకుండా డీసీఎం ముందూ వెనకా రెండు పైలట్​వెహికల్స్​తో కట్టుదిట్టమైన రవాణా! ఇంత పకడ్బందీగా తీసుకెళ్తున్నారంటే.. అందులో ఉన్నది ఏ బంగారమో.. డబ్బో అనుకునేరు. కానే కాదు. కిలోల కొద్దీ గంజాయి. పోలీసులకు దొరకకుండా కొందరు స్మగ్లర్లు పన్నిన ప్లాన్​ ఇది. చేసేదేం మంచి పని కాదు కదా.. పోలీసులకు దొరికిపోయారు. కటకటాలు లెక్కపెడుతున్నారు. ఎస్కార్ట్​ వెహికల్స్​తో విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్​ ఎల్బీనగర్​ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.65 వేల క్యాష్‌, 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ రూ.83.6 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న ఏజెంట్​ కోసం గాలిస్తున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ శనివారం వెల్లడించారు.

3 వేలకు కొని.. 10 వేలకు అమ్మకం

విశాఖపట్నంలోని బుచ్చయ్యపేటకు చెందిన పతల నగేశ్​(23) వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఏజెన్సీ ఏరియాలో తక్కువ ధరకు దొరికే గంజాయిని స్మగ్లింగ్​ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్​ వేశాడు. హైదరాబాద్​, జహీరాబాద్​, మహారాష్ట్ర బార్డర్లలో ఏజెంట్లను నియమించుకున్నాడు. హైదరాబాద్​లోని జవహర్​నగర్​తో పాటు సిటీ శివార్లలో షెల్టర్లూ ఏర్పాటు చేసుకున్నాడు. ఏజెంట్ల ద్వారా ఆర్డర్లు తీసుకుని.. జహీరాబాద్​కు చెందిన ఏజెంట్​ కార్తీక్​ రాథోడ్​ ద్వారా గంజాయిని తరలించేవాడు. ఏజెన్సీ ఏరియాలో కిలో గంజాయిని రూ.3 వేలకు కొని.. మహారాష్ట్రలోని కస్టమర్లకు రూ.10 వేల చొప్పున అమ్మేవాడు. ఈ క్రమంలో చాలాసార్లు పోలీసులకు దొరికిపోయాడు. నిరుడు జహీరాబాద్​లో నమోదైన కేసులో నగేశ్​ వాంటెడ్ ​నేరస్థుడిగా ఉన్నాడు. అయినా తీరు మార్చుకోని అతడు.. గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్నాడు.

పోలీసులు కనిపిస్తే అలర్ట్​

గంజాయి స్మగ్లింగ్​ కోసం మొగ్గ హరి (27), రవడ వెంకట కిషోర్​‌ రెడ్డి (30), గుడ్డేటి కన్నమ నాయుడు (27), గంజి తేజ (22), మగ్గి చక్రవర్తి (31), గురుగొల్లి అప్పల రెడ్డి (28), పసుపునేటి శివాజీ (27)తో ఓ గ్యాంగ్​ ఏర్పాటు చేశాడు. కార్తీక్​ రాథోడ్​ ఆర్డర్​తో ఒక్కో ప్యాకెట్​లో రెండున్నర కిలోల చొప్పున 300 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయిని డీసీఎంలో ఎక్కించాడు. ఆ డీసీఎంకు ముందు ఓ కారు​లో ముగ్గురు, వెనుక కారు​లో మరో ముగ్గురిని ఎస్కార్ట్​గా పంపాడు. దారిలో ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే వెంటనే డీసీఎంలోని వ్యక్తులను అలర్ట్​ చేసి దారి మళ్లించేలా పథకం వేశారు. అయితే, ఏపీలోని జి.మాడుగుల నుంచి గంజాయిని తరలిస్తున్నారని రాచకొండ ఎస్​వోటీ, హయత్​నగర్​ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెద్ద అంబర్​పేట దగ్గర చెకింగ్​ చేస్తుండగా.. డీసీఎం వ్యాన్​లో గంజాయిని గుర్తించారు. నిందితులను అరెస్టు​ చేశారు. జహీరాబాద్​కు చెందిన కార్తీక్​ రాథోడ్​ కోసం గాలిస్తున్నారు.