ఇంద్రకీలాద్రిపై పాముకు దహన సంస్కారాలు

ఇంద్రకీలాద్రిపై పాముకు దహన సంస్కారాలు

విజయవాడ దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాముల్లో ఒకటి మృతి చెందడంతో శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే దహన సంస్కారాలు చేయాలని వైదిక కమిటీ సూచించింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై గత కొంతకాలంగా తిరుగుతున్న ఓ సర్పం మృతి చెందడంతో కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్‌లోకి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. రెండు సర్పాలు ఇంద్రకీలాద్రిపై గత కొంతకాలంగా కనిపిస్తున్నాయని, అయితే ఇటీవలే ఓ పాము కనిపించకుండా పోయిందని, ఆ పాము కొండ దిగువ ప్రాంతంలో టర్నింగ్‌ వద్ద చనిపోయి కనిపించిందని ఆలయ వైదిక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 

దీంతో ఆ సర్పానికి మనుషుల మాదిరిగానే .. వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా దహన సంస్కారాల క్రతువు నిర్వహించారు.  ఆ తర్వాత  పాము అస్తికలు కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.