బట్టలు ఉతికినందుకు రూ.5,900 బిల్లు! హోటల్ ఇచ్చిన షాక్‌కు వ్యాపారవేత్త మైండ్ బ్లాక్..

బట్టలు ఉతికినందుకు రూ.5,900 బిల్లు! హోటల్ ఇచ్చిన షాక్‌కు వ్యాపారవేత్త మైండ్ బ్లాక్..

లగ్జరీ హోటళ్లలో ఉండటం చూడటానికి రిచ్‌గా ఉన్నా, అక్కడ వసూలు చేసే ఛార్జీలు ఒక్కోసారి కోటీశ్వరులను కూడా షాక్ అయ్యేలా  చేస్తాయి. ఎందుకంటే ప్రముఖ వ్యాపారవేత్త కునాల్ బహల్ ఎదుర్కొన్న అనుభవమే దీనికి నిదర్శనం. కునాల్ బహల్ ఒక హోటల్‌లో ఉన్నప్పుడు  అతని బట్టలను  ఉతకడానికి ఇచ్చారు. అది కూడా 7 మాత్రమే..  దానికి హోటల్  వేసిన బిల్లు చూసి ఆయన నోరెళ్లబెట్టారు. ఆ బిల్లు అక్షరాలా 5 వేల 900. అంటే ఒక షర్ట్ లేదా ప్యాంట్ ఉతకడానికి సగటున 800 రూపాయల కంటే ఎక్కువ ఖర్చయిందన్నమాట. దీనికి అదనంగా మళ్ళీ టాక్స్ పడింది. దీనిపై ఆయన సోషల్ మీడియా (X)లో  ఆవేదన వ్యక్తం చేస్తూ.. "నేను కొన్న బట్టల ధర కంటే, వాటిని ఉతికించడానికి అయిన ఖర్చే ఎక్కువగా ఉంది" అని అన్నారు.

కొత్త బిజినెస్ ఐడియా:
ఈ  బిల్లు చూశాక కునాల్‌లో ఇన్వెస్టర్ ఆలోచనలు మొదలయ్యాయి. బ్లింకిట్, జెప్టో లాగా బట్టలు ఉతకడానికి కూడా ఏదైనా 'క్విక్ కామర్స్'  స్టార్టప్ ఎవరైనా మొదలుపెడుతున్నారా ? అని ప్రశ్నించారు. హోటల్ ఫుడ్ రేట్లు భరించలేక ఇప్పటికే అందరూ జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నారని, ఇప్పుడు లాండ్రీ విషయంలో కూడా హోటళ్లు ఆలోచన  చేసుకోవాలని ఆయన సూచించారు.

నెటిజన్ల రియాక్షన్:
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒకరు  "నాకు తెలిసి మీ బట్టలను ఏవైనా ప్రత్యేకమైన పద్ధతిలో చేత్తో ఉతికి ఉంటారేమో!" అని జోక్ చేయగా....మరొకరు "అంత డబ్బుతో నేను రెండేళ్లకు సరిపడా కొత్త బట్టలు కొనుక్కుంటాను" అని రాశారు. ఇంకొకరు  "లాండ్రీ బిజినెస్ ఇండియాలో అంత ఈజీ కాదు, ఫుడ్ డెలివరీలోనే లాభాలు రావడం కష్టంగా ఉంది" అని తన అభిప్రాయం చెప్పారు.