- ‘‘బాంబ్ సైక్లోన్’’గా బలపడే ప్రమాదం
- నేషనల్ హైవేలు మూసివేత
- వేలాది విమానాల రద్దు
- న్యూయార్క్‌తో పాటు పలు నగరాల్లో ఎమర్జెన్సీ
- అనవసరంగా బయటికి రావొద్దు: జో బైడెన్
వాషింగ్టన్: అమెరికాను మంచు తుఫాను వణికిస్తున్నది. మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డు కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. జాతీయ రహదారులు మూసివేశారు. వేలాది విమానాలు క్యాన్సిల్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు ‘‘బాంబ్ సైక్లోన్’గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్ సంస్థ హెచ్చరించింది. క్రిస్మస్ హాలిడేస్‌కు ముందు అమెరికన్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నిమిషాల్లో శరీరం గడ్డకట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సౌత్ డకోటాలోని ఐ–90 హైవే మూసివేసినట్టు అధికారులు తెలిపారు. రోడ్డుపై భారీగా మంచు పేరుకుపోయిందన్నారు.
గంటకు 105 కి.మీ. వేగంతో చలిగాలులు
న్యూయార్క్‌తో పాటు కొన్ని నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పెద్ద మంచు ముక్కలు నదీ ప్రవాహానికి అడ్డుపడి వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. న్యూయార్క్, సెయింట్‌పాల్, కెంటకీ, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, జార్జియా, ఓక్లహోమాలో పరిస్థితి దారుణంగా ఉంది. డెస్‌మోయిన్స్ నగరాన్ని మంచు పూర్తిగా కప్పేసింది. మినియాపొలిస్, సెయింట్‌పాల్ సిటీలలో 20 సెంటీ మీటర్ల మేర మంచు పేరుకుపోయింది. గంటకు 105 కి.మీ వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. ‘‘ఇది మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజులు కావు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అనవసరంగా బయటికి రావొద్దు” అని ప్రెసిడెంట్ బైడెన్ ప్రజలను హెచ్చరించారు.
భారీ సంఖ్యలో విమానాలు రద్దు
గురువారం 2,270 విమానాలు క్యాన్సిల్ చేశారు. మంచు, వర్షం, చలిగాలులు కారణం గా విమాన, రైలు, బస్సు ప్రయాణాలు రద్దయ్యాయి. శుక్రవారం 1,000 విమానాలు క్యాన్సిల్ చేశారు. శనివారం బయలుదేరే 85 ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 22వేల విమానాలపై మంచు తుఫాన్ ఎఫెక్ట్ పడిందన్నారు. చికాగో, డెన్వర్ ఎయిర్‌పోర్టులపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. చికాగోలోని ఓహరేలో మైనస్ 13 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యిందని వివరించారు. పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలకు డీ ఐసింగ్ ద్రవాన్ని చల్లాల్సి వస్తోందని తెలిపారు.
