
- ‘మన ఊరు– మన బడి’ టెండర్స్ గోల్‌మాల్
- 700 కోట్ల నుంచి 1,539 కోట్లకు అంచనా పెంపు
- 2 కంపెనీలకే నాలుగు టెండర్లు
- సీబీఐ, లోకాయుక్తలో కంప్లైంట్ చేసిన సోషల్ వర్కర్ గణేశ్
హైదరాబాద్,వెలుగు: ‘మనఊరు – మనబడి’ ప్రాజెక్ట్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ సామాజిక కార్యకర్త గణేశ్ సోమవారం సీబీఐ,లోకాయుక్తను ఆశ్రయించాడు. నిబంధనలకు విరుద్ధంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్(ఎంఈఐఎల్) కంపెనీ దక్కించుకున్న టెండర్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అవకతవకలకు పాల్పడ్డ విద్యాశాఖ అధికారులపై చర్యలకు ఆదేశించాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. ‘‘స్టేట్ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) పెయింట్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, డ్యూయల్ డెస్క్, ఇతర అవసరాల కోసం టెండర్స్ పిలిచింది. ఇందుకోసం సుమారు రూ.700 కోట్లకు ఎస్టిమేట్చేస్తూ ఏప్రిల్‌లో టెండర్స్ పిలిచింది. మే 9న వాటిని రద్దు చేసింది. ఇవే పనులకు రూ.1539 కోట్లుగా నిర్ధారిస్తూ మే 25న టెండర్స్ క్లోజ్ చేసింది. మళ్లీ 30న బిడ్డింగ్ ఓపెన్ చేసింది. కేవలం కొన్ని కంపెనీల ప్రయోజనం కోసమే మార్పులు జరిగాయి’’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అన్నీ జాయింట్ కంపెనీలే
రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన బడులకు పెయింట్స్ వేసేందుకు పిలిచిన పెయింట్స్కేటగిరిలో మేఘా 80 శాతం, ఏషియన్ పెయింట్స్ 20 శాతం, మరో కంపెనీ హెచ్‌ఐపీఎల్80 శాతం, ఫ్యూచర్ పెయింట్స్ 20 శాతంగా షేర్స్ తీసుకున్నాయని గణేశ్చెప్పాడు. ఇవి రెండు జాయింట్ వెంచర్ కంపెనీలుగా పేర్కొన్నాడు. టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ కూడా మోనోపొలిగా బిడ్డింగ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించాడు. బడుల్లో డ్యూయల్ డెస్కుల ఏర్పాటు కేటగిరిలో కూడా 4 కంపెనీలు పాల్గొన్నా ఆ రెండు కంపెనీలకే టెండర్స్ దక్కాయని, గ్రీన్ చాక్ బోర్డుల టెండర్స్‌లో కూడా 5 కంపెనీలు పాల్గొంటే కేవలం మేఘా కంపెనీని మాత్రమే క్వాలిఫై చేశారని పేర్కొన్నాడు. పూర్తిగా అవకతవకలు జరిగాయని టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలువాలని కోరాడు. మేఘా కంపెనీలకు లబ్ధిచేకూరేల వ్యవహరించిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.