సామాజిక ఆవేదనలు అక్షర రూపం .. కవితలు భావం మాత్రమే కాదు.. ఒక శక్తి స్వరూపం

సామాజిక ఆవేదనలు అక్షర రూపం .. కవితలు భావం మాత్రమే కాదు.. ఒక శక్తి స్వరూపం

తెలుగు కవిత్వం గత కొన్ని దశాబ్దాలుగా అనేక భావజాలాలకు వేదికైంది. అయితే, ఒక విజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు తన వృత్తిలోని తర్కాన్ని, ప్రవృత్తిలోని భావుకతను మేళవించి కావ్యాన్ని సృజించడం ఒక అరుదైన ప్రక్రియ. ఫిజిక్స్ అరుణ్ కుమార్ వెలువరించిన ‘శూన్యం’ కవితా సంపుటి సరిగ్గా ఈ బిందువు వద్దే ఆవిష్కృతమవుతుంది. ఈ సంపుటిలోని 58 కవితలు చదువుతుంటే.. అక్షరం కేవలం భావం మాత్రమే కాదు, అది ఒక శక్తి స్వరూపం అని అర్థమవుతుంది.

ఈ సంపుటిలో మొదటిగా మనల్ని కదిలించేది కవిలోని జాతీయ స్పృహ. ‘ఆగస్టు 23, 2023’ కవిత చంద్రయాన్ విజయాన్ని కేవలం ఒక వార్తగా కాకుండా, కోట్లాది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీకగా చిత్రించింది. గతంలో చేజారిన ల్యాండింగ్ తాలూకు వైఫల్యాన్ని ‘కత్తుల జ్ఞాపకం’గా అభివర్ణిస్తూనే శాస్త్రవేత్తల నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం ఎలా గెలిచిందో వర్ణించిన తీరు ఉత్కృష్టంగా ఉంది. “విక్రమ్ ల్యాండర్ జాబిల్లి పురిటినొప్పులు దాటి కలల రెక్కలు విప్పుకుంది” అన్న ప్రయోగం వైజ్ఞానిక పరిభాషకు ప్రాణం పోసింది.

కవి వృత్తి రీత్యా ఫిజిక్స్ అధ్యాపకుడు కావడం వల్ల ఆయన భావనా ప్రపంచంలో శాస్త్ర సంజ్ఞలు సహజంగానే చోటుచేసుకున్నాయి. గురువును ‘అయస్కాంత దిక్సూచి’గా చూడటం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. అయస్కాంతం ఎలాగైతే దిశను నిర్దేశిస్తుందో, గురువు కూడా సమాజానికి మార్గదర్శి అని కవి ఉద్దేశం. 

ఆధ్యాత్మికతను, రసాయన శాస్త్ర ఉత్ప్రేరకాలతో పోల్చడం, మానవీయ విలువలను గణిత సిద్ధాంతాలతో అన్వయించడం అరుణ్ కుమార్ శైలిలోని విశిష్టత. ఇది పాఠకుడికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది.

సాహిత్యం సామాజిక విధులను విస్మరించకూడదు అన్న సత్యం ఈ సంపుటిలో అడుగడుగునా కనిపిస్తుంది.‘ట్రోలింగ్’ కవితలో ఆధునికత ముసుగులో జరుగుతున్న డిజిటల్ హింసను కవి ఎండగట్టారు. స్త్రీ భావాలు నిశ్శబ్దంగా సమాధి అవుతున్న తీరును చూసి చలించారు. “ఆమె ఆధునిక ఉద్వేగాల గాజుల సందడి నిశీధిలో నిర్జీవమైంది” అనడంలో ఒక విషాద సౌందర్యం ఉంది.

రైతును ఒక సైనికుడిగా, ఆయన పొలాన్ని ఒక ‘కవికలం’గా దర్శించడం కవిలోని సామాజిక బాధ్యతకు నిదర్శనం. వ్యవసాయం అనేది లాభనష్టాల వ్యాపారం కాదు. అది ఆకలిని జయించే ఒక మహా ఉద్యమమని ‘మరో సత్యాగ్రహం’ ద్వారా చాటి చెప్పారు.ప్రస్తుత ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ అంశాన్ని ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్’ ద్వారా చర్చించారు. 

అభివృద్ధి చాటున అడవులు అంతరించిపోవడాన్ని, మానవ విలువలు పతనమవ్వడాన్ని కవి ఒకే గాడిలో పెట్టి విశ్లేషించారు. ప్రకృతి గమనం తప్పితే ఆధునికత ఆవిరైపోతుందన్న హెచ్చరిక ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. బాంబుల మోత, రక్తపు మరకల మధ్య మానవత్వం ప్రాణాలు వదలడంపై కవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సంపుటిలో కేవలం గంభీర విషయాలే కాకుండా, మనసును హత్తుకునే సున్నిత భావాలు కూడా ఉన్నాయి. ‘నానమ్మ పెంచిన ప్రాణాలే’ కవితలో బాల్యపు స్మృతులు, అమ్మ ప్రేమ, తాత చెప్పిన కథలు ఒక మధ్యతరగతి జీవితంలోని మాధుర్యాన్ని గుర్తుచేస్తాయి. “అమ్మకు ప్రత్యామ్నాయం లేదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనంలోనూ అమ్మతనానికి అస్తమయం లేదు” అని టెక్నాలజీ పరిమితులను, మాతృత్వపు అనంతత్వాన్ని కవి స్పష్టం చేశారు.

పుస్తకం పేరు ‘శూన్యం’ అని పెట్టినప్పటికీ, ఇందులో నిండిన భావాలు అనంతం. ఫిజిక్స్ ప్రకారం శూన్యం అనేది ఒక శక్తి క్షేత్రం. అలాగే ఈ కవితల్లోనూ విప్లవ క్షిపణులు, సాహితీ శిఖరాలు, భాషాభిమానం వంటి భిన్న అంశాలు మేళవించబడ్డాయి. 

ముగింపులో కవి చెప్పినట్టు.. జీవితం అనేది ఒక మిస్టరీ, ఒక ఫిజిక్స్.. ‘శూన్యం’లోని ప్రతి కవితా ఒక విస్ఫోటనం లాంటిదే. అది అజ్ఞానపు చీకట్లను చీల్చుతూ జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది.  ఈ కవితలు ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక అర్థవంతమైన స్థానాన్ని సంపాదించుకుంటాయనడంలో సందేహం లేదు. 

అమ్మ.. అంతరిక్షమంత ప్రేమ
అమ్మ ఓ అద్భుత సెర్చ్‌ లైట్‌..
నేను వెతుకుతున్న పెన్ను..
అక్క చెల్లెలికి కనిపించని జడ పిన్ను‌..
నాన్న యాది మరిచిన కళ్ల అద్దాలు..
తాతయ్య దాచిన పెట్టిన బీడీ కట్టలు..
అన్నింటినీ చీకట్లో సహితం..
అమ్మ సెర్చ్‌ లైట్‌లా ‌ వెతికి పెడుతుంది
అమ్మతనానికి అదో అద్భుత కళ!

అమ్మ దాచినదేదీ ఎవ్వరికీ దొరకదు..
అమ్మ పోపుల పెట్టెలో దాచిన బాధలు
డబ్బాల వెనుక దాచిన శరీర నొప్పులు
దిండులో దాచిన కన్నీళ్లు..
అన్నింటినీ ఎవరూ గుర్తించలేని..
స్థానాల్లో అమ్మ దాచిపెట్టి..
నవ్వుల పువ్వులనే ప్రదర్శిస్తుంది 

అమ్మ వద్ద ఉన్న సెర్చ్‌ లైట్..
‌మన ఎవ్వరి వద్దా లేదు కదా!
అమ్మ మనసు అనంత ఆకాశమంత 
ఆకాశం సదా మౌనంగానే ఉంటుంది 
అమ్మ మనసులో అదృశ్య ఆవేదనలు
కుటుంబ సమస్యల కారుమబ్బులు
ఉరుములతో కూడిన కష్టనష్టాలు 
అనుకోని ఆపదల అకాలవర్ష వడగళ్లు
ప్రమాదాల పిడుగుల ప్రతికూలతలు
క్షణకాల మెరుపుల శుభవార్తల వెలుగులు
అయినా అమ్మ ముఖంపై చిరునవ్వులు !

అమాయకత్వాన్ని ప్రదర్శించే మేధావి
లోకజ్ఞానంలో ఆమె అసమాన ప్రతిభ 
తన ప్రేమ స్పర్శలే రుగ్మతలకు లేపనాలు
ఆమె చేయి పడిన వంట అమృతం 
కుటుంబ అనుబంధ తీగకు తల్లే పందిరి
ఆమె ఆవేశం క్షణాల్లో ఆవిరై ఆనందవర్షాలు
అమ్మ లేని గృహం అనాథాశ్రమం !
- మధుపాళీ 

- ఎల్ ఎన్ కొల్లి,సమీక్ష / వ్యాసకర్త–