వచ్చే నెల 10 నుంచి అమలు.. చట్టం తీసుకొచ్చామన్న ప్రధాని అల్బనీస్
16 ఏండ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్,
ఎక్స్, స్నాప్‌చాట్, యూట్యూబ్ వంటివి నో యాక్సెస్
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధాన్ని డిసెంబర్ 10 నుంచి అమల్లోకి తెస్తామని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. నవంబర్ 2024లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని ‘వరల్డ్ లీడింగ్ సోషల్ మీడియా’గా కొనియాడారు. ఇది పిల్లల బాల్యాన్ని రక్షించడంతో పాటు తల్లిదండ్రులను వారికి మరింత దగ్గర చేస్తోందని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ సెఫ్టీ అమెండ్‌మెంట్ (సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్లు– 2024.. డిసెంబర్ 10న చట్టంగా రూపుదిద్దుకోనుంది. ఈ చట్టం 16 ఏండ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఎక్స్, స్నాప్‌చాట్, యూట్యూబ్, రెడ్‌ఇట్, కిక్ వంటి అనేక ప్లాట్‌ఫారమ్స్‌ను ఉపయోగించకుండా నియంత్రిస్తుంది. ఈ సందర్భంగా అల్బనీస్ మాట్లాడుతూ.. ‘‘ఒక నెల రోజుల్లో దేశంలో సోషల్ మీడియా చట్టం అమల్లోకి రానుంది. ఇది పిల్లలను పిల్లలుగా ఉండనివ్వనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల, లక్ష్యాల గురించి వారితో చర్చించే అధికారం ఇవ్వనుంది”అని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం మైనర్ పిల్లలకు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని
ఆయా కంపెనీలకు సూచించారు.
