
సోషల్ మీడియా దిగ్గజం మెటా ఏఐ రంగంలో దూసుకుపోతోంది. వైబ్స్ పేరుతో కొత్త ఏఐ వీడియోల ఫీడ్‌ను ప్రారంభించింది. ఇందులో యూజర్లు ఏఐ జనరేటెడ్ షార్ట్-ఫామ్ వీడియోలను క్రియేట్ చేసి, షేర్ చేయొచ్చు. వాటిని మెటా ఏఐ యాప్, వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇది ఏఐ వెర్షన్ షార్ట్ వీడియో ఫ్లాట్‌ఫామ్‌లా పనిచేస్తుంది.
వైబ్స్‌లో కొత్త ఫీడ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు క్రియేటర్లు లేదా యూజర్లకు ఏఐ రూపొందించిన వీడియోలు మాత్రమే కనిపిస్తాయి. అలాంటి వీడియోలను ఎవరైనా స్క్రాచ్ నుంచి రూపొందించవచ్చు లేదంటే ఫీడ్‌లో కనిపించిన వీడియోను రీమిక్స్ చేసుకోవచ్చు. వాళ్ల దగ్గర అప్పటికే ఉన్న కంటెంట్‌తో కూడా చేసుకోవచ్చు. వీడియో అప్‌లోడ్ చేసే ముందు కొత్త విజువల్స్, మ్యూజిక్ లేయర్‌ని యాడ్ చేయొచ్చు.
అంతేకాదు.. వీడియోలను అప్‌లోడ్ చేయడంతోపాటు ఇతరులకు డైరెక్ట్ మెసేజ్ ద్వారా కూడా పంపొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ స్టోరీలకు క్రాస్-పోస్ట్ చేయొచ్చు. వైబ్స్ కోసం మెటా ప్రత్యేకంగా ఏఐ ఇమేజ్ జనరేటర్లు మిడ్ జర్నీ, బ్లాక్ ఫారెస్ట్ ల్యాబ్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.