బెంగళూరు యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. వారిలో లే ఆఫ్ ఐటీ ఉద్యోగి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యో శ్రద్దా జైన్ ఉన్నారు. మోడీ తనని చూసి ‘అయ్యో’ అని పిలిచారని తెగ సంతోష పడుతున్నారు. ‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మోడీకి కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ శ్రద్దా జైన్ ఎవరు? మోడీ ఆమెను చూసి అయ్యో అని ఎందుకు పిలిచారంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో తమ ఉద్యోగులను ఐటీ కంపెనీల తొలగిస్తున్నాయి. వివిధ కారణాలతో మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్, అమెజాన్,ట్విటర్, మెటా నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. అలా ఉద్యోగం కోల్పోయిన వారిలో శ్రద్దాజైన్ ఒకరు. నెటిజన్లకు అయ్యో శ్రద్దా జైన్‌గా ఈమె బాగా సుపరిచితురాలు. ఉద్యోగుల తొలగింపులపై ఐటీ కంపెనీలపై వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ అంటూ చేసిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను 20లక్షల మందికిపైగా వీక్షించారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా సైతం ఆ వీడియోను షేర్ చేశారు. తాజాగా శ్రద్దా జైన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ తనని ‘అయ్యో’ అని పిలవడాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ నెటిజన‍్లతో పంచుకుంది.ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్దా జైన్ ప్రస్తుత సమాజంలో అన్నీ అంశాలపై స్పందిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ఎక్కువగా అయ్యో అనే పదం వాడుతుంటారు. దీంతో ఆమె పేరు ముందు అయ్యో అనే పదం నిక్ నేమ్‌గా మారింది.
