జీవిత అనుభవాల సమాహారం.. సామాజిక విలువలు ప్రతిబింబించే రచనలు

జీవిత అనుభవాల సమాహారం.. సామాజిక విలువలు ప్రతిబింబించే రచనలు

సమకాలీన తెలుగు కవిత్వంలో గ్రామీణ జీవన విధానం, మానవ సంబంధాలు, సామాజిక విలువలను ప్రతిబింబించే రచనల్లో ‘దండకడియం’ ప్రత్యేక స్థానం సంపాదించింది. రచయిత గ్రామీణ సంస్కృతి, ఆచారాలు, మనుషుల మధ్య ఉన్న బంధాలను, శ్రామికుల జీవన విధానాన్ని ఎంతో సహజంగా కవిత్వీకరించాడు. 

సాహిత్యంలో ఈ వస్తువుపైనే కవిత్వం రాయాలనే నియమాలు లేవు “కాదేదీ కవితకు అనర్హం, కవితమయమేనోయ్ అన్ని” అనే శ్రీశ్రీ పంక్తులు దండకడియంలోని కవితలన్నింటికీ సరితూగుతాయి. గ్రామీణ జీవన నేపథ్యం నుంచి వచ్చిన  తగుళ్ళ గోపాల్ తన జీవిత అనుభవాలను, సమాజంలో తాను చూసిన వివిధ సంఘటనలను వస్తువులుగా చేసుకొని ఈ కవితలు రాశాడు. ఈ పుస్తకంలోని కవితలను చదువుతున్నప్పుడు గ్రామీణ వాతావరణాన్ని కళ్లముందు ఆవిష్కరించినట్లుగా ఉంటుంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమానురాగాలు, మానవీయ విలువలు తగ్గుతున్నాయి. వాటి గురించి తన రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో  బాధలు పడుతూ, బయటకు చెప్పుకోకుండా లోలోపల దిగమింగుకుని తమ బిడ్డల భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులపై పిల్లలు చూపుతున్న నిర్లక్ష్యానికి ఉదాహరణ ‘అమ్మ దీపం’ కవిత. “వత్తి జేసి, నూనె పోసి / బతుకును వెలిగించినందుకు కొడుకు / ఈ అమ్మ దీపాన్ని గాలికి పెట్టి పోయిండు” మనం చేరదీసి సాదుకునే జీవులు మనపై మమకారం చూపిస్తాయి. కానీ, తమ జీతాన్ని వత్తి చేసి, చెమట బిందువులను నూనెగా మార్చి, కొత్త జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోవడాన్ని కవి ఎత్తిచూపుతాడు. 

మనిషికీ.. మనిషికీ మధ్య సంబంధాలు తగ్గుతున్న నేపథ్యంలో ఎవరూ పట్టించుకోని, తనకు ఎటువంటి సంబంధం లేని ఒక వృద్ధురాలికి ఏర్పడ్డ సంబంధాన్ని గురించి ‘ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం/ ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం / ఇది చాలదా? / మేం బంధువులం కావడానికి’ అంటాడు. నలుగురు కొడుకులు గల తల్లిని వంతుల వారీగా పంచుకొని సాధకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లినందుకు తాను ధన్యురాలంటాడు.

 ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులపై సరైన పట్టింపులేని కొడుకుల వైఖరిని నిలదీశాడు.
గ్రామాలలో ఒకప్పుడు ఒకరి కష్ట సుఖాలను మరొకరితో పంచుకునేవారు. మనసునిండా మాట్లాడేవారు. మారుతున్న కాలంతో నిత్యం జీవన గెలుపు బాటలో పరుగెడుతున్న మనుషుల మధ్య ఆప్యాయమైన పలకరింపులు కరువైన తరుణాన్ని, మనసు విప్పి మాట్లాడని మనుషులను కవి వివిధ సందర్భాలలో వ్యక్తీకరించాడు. ఇద్దరి భావాలను అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం. 

కొందరి మాటల్లో మోసం ఉండొచ్చు. కొందరి మాటల్లో స్వార్థం ఉండొచ్చు. కొందరు మాట్లాడే మాటలు మనసుకు గాయం చేయొచ్చు. ఇంకొందరి మాటలు మనసులో బరువు తగ్గించొచ్చు. ఏది ఏమైనా ఈ మాటల వల్లే మనం మనుషులమయ్యాం. తనకిప్పుడు యంత్రాలతో మాట్లాడటం కాదు తన ఎదురు చూపంతా తనతో గలగల మాట్లాడే మనుషులకోసం. ‘ఎగిరిపోయిన మాటల పావురాలను / మళ్ళీ భూమి మీదకు తీసుకొద్దాం / స్నేహం గింజలేసి పలకరింపులతో నీళ్లు బెట్టి / మళ్ళీ బాంధవ్యాలనే కువకువ రాగాలను బతికిద్దాం’ అంటాడు.

‘శ్రమ జీవనంలోని సౌందర్యానికి మించిన మరో సౌందర్యం లేదనే మాట గోపాల్ కవిత్వంలో ప్రతిధ్వనిస్తుంది. పల్లె మట్టి పరిమళాలను, ప్రకృతి ప్రేమను తన తనువంతా పూసుకున్నాడు. కనుకనే అసలైన వృత్తి జీవనాన్ని , శ్రమ సౌందర్యాన్ని, శ్రమ గౌరవాన్ని చక్కగా వర్ణించాడు. ఉత్పత్తి కులం, శ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చిన కవులు మాత్రమే సారవంతమైన  కవిత్వం రాయగలరనడానికి గోపాల్ ‘వాళ్లు రంగులద్దిన వాక్యాలు’ అనే కవితే నిదర్శనం. ‘కూరగాయల గంపను / ఇంటింటిదగ్గర / ఎత్తుకుంటూ దించుకుంటూ / బతుకుపాటతో ఊరిని నిద్రలేపే / పల్లెతల్లి నెత్తిన/ తళుక్కున మెరిసే కొప్పు బిల్లౌతుంది / ఒంట్లోని నరాలను వడికి / మగ్గంపై దారాలుగా పేర్చి/పడుగుపేకల మధ్య చూపుల్ని బిగించి/నేతన్న నేసిన పట్టుచీరకు / అంచుగా నిలిచిపోతుంది...

 సద్దిమూటతోపాటు / ఎండను నెత్తిన కట్టుకొని బాటపొంట గొర్లను మర్లేసుకుంట పోయే / అవ్వచేతికి ముంజేతి కడెమై నవ్వుతుంది / వాళ్లు రంగులద్దిన వాక్యాలు’ అంటూ వృత్తికులాల బతుకు చిత్రాలను చిత్రించాడు. ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి నిద్ర పోయేంతవరకు విరామం లేకుండా  పనిచేసే పల్లె స్త్రీల జీవితాన్ని, వారి కష్టాలను, బాధలను మలినం లేని వారి మనసులను గురించి రాయడం ద్వారా స్త్రీల పట్ల కవికున్న గౌరవం అర్థమవుతుంది. 

నిరక్షరాస్యులైన స్త్రీల చేతుల నుంచి రూపుదిద్దుకున్న కళాత్మకమైన ఈత సాపలు, బుట్టలు తయారు చేయడానికి విశ్వవిద్యాలయ స్థాయి కళానైపుణ్య విద్య అవసరం లేదంటూ ఏ యూనివర్సిటీలోనూ చదవలేదు / కళావిద్య అంటే అస్సలే ఎరుగదు / అయినా అమ్మ / ఈత సాపను ఎంత నైపుణ్యంగా అల్లుతుందో! గిజిగాడు గూడును అల్లినట్టు!!’ అంటూనే  ‘చియ్య కూరల పాట’ కవితలో  ఈత కర్రల తలలను / పెద్ద కొడవలితో / రెండు పాయలుగా దువ్వడం / తాతల కాలం నుండి వస్తున్న విద్య నీకని’  ఎరుకల స్త్రీ చేతి కళను పొగుడుతాడు.  

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన  గోపాల్ అనేక కష్టాలను చూశాడు. అందుకే జీవితంలోని కమ్మదనాన్ని చూడగలిగాడు. తన కాళ్లకు గుచ్చిన ముండ్లే  జీవిత ఉద్యమ పాఠాలను బోధించి రాయిలాగ బతకడం నేర్పాయి అంటాడు.

 పంటకు గిట్టుబాటు ధర రాక, దళారుల చేతిలో మోసపోయి ఆరుతున్న మెతుకు దీపాల(రైతుల) నెత్తుటి పాదాలకు తన కవిత్వంతో కొత్త జోళ్లను తొడిగాడు. సమాజంలో అంటుగట్టుకుపోయిన కులమతాల అడ్డుగోడల్ని బద్దలగొట్టడానికి ‘అడ్డుగోడలు’ కవితతో పిలుపునిస్తాడు. 

ఇన్నేండ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కొనసాగుతున్న ఈ అంతరాలను అంతం చేయాలంటూ ‘మనుషుల్ని నరికే ఈ గోడను కూల్చడానికి / ఏ పలుగు పార అవసరంలేదు / మానవత్వపు మొక్కను నాటితే / పగుళ్లు వచ్చి కూలిపోతుంది’  అని తన మనోవేదనను వ్యక్తపరుస్తాడు.

 ఆకలేసి రెండు మామిడి పండ్లు తిన్నందుకు దొంగతనం చేసాడనే తప్పుమోపి ఉరిశిక్ష  విధించిన పెద్దమనుషుల తీర్పును ప్రశ్నిస్తూ నన్ను ఉరితీసిన మీ చేతులతోనే / ఇంకా మా వాడల్లో రాజ్యమేలుతున్న / ఈ ఆకలిని కూడా ఉరి తీయమంటాడు. 

తరతరాలుగా మా అక్క చెల్లెల మాన ప్రాణాలను గడ్డివాముల్లో తగలబెట్టిన మీకు ఎలాంటి శిక్షలు ఉండవా? మా రక్త మాంసాలు తింటున్నా మిమ్మల్ని ఏ కొండ దేవతకు బలియ్యాలి? అని నిలదీశాడు. ఇలా శ్రమ సౌందర్యం, ప్రకృతి పరిమళంతో నింపిన ‘దండకడియం’ ప్రతి ఒక్కరి మనసుకు తొడిగిన ఒక వెండి కడియం.

- టి. అంజన్ కుమార్,   9392456894