స్కూటీని ఢీకొట్టిన డీసీఎం... సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్ మృతి

స్కూటీని ఢీకొట్టిన డీసీఎం... సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్ మృతి

చందానగర్, వెలుగు :  స్కూటీని డీసీఎం ఢీకొట్టడంతో ఐటీ ఎంప్లాయ్ చనిపోయిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కోవెలమూడి గ్రామానికి చెందిన రామినేని మహేష్ బాబు(32) భార్య రత్నాంబ, కొడుకుతో కలిసి 8 నెలల కిందట సిటీకి వచ్చి పటాన్ చెరు పరిధి రామచంద్రాపురంలో ఉంటున్నాడు. ఐటీ కారిడార్​లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్​గా పనిచేస్తున్నాడు. 

మంగళవారం ఉదయం 5.50 గంటలకు అతడి ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో మియాపూర్​లో తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి సిలిండర్ తెచ్చేందుకు స్కూటీపై బయలుదేరాడు. ఆర్సీపురం నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా.. చందానగర్ మెయిన్ రోడ్​లో ఓ డీసీఎం అతడి బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై నుంచి మహేష్ బాబు కిందపడ్డాడు. అతడిపై నుంచి డీసీఎం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. 

స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

తాగివెహికల్ నడిపి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి(28) సూరారంలోని  ప్రైవేటు హాస్టల్​లో ఉంటూ ఓ ఫార్మా కంపెనీలో టెస్టింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఫ్రెండ్స్​తో కలిసి పార్టీ చేసుకున్న భాస్కర్ రెడ్డి మద్యం తాగాడు. అర్ధరాత్రి దాటాక 2 గంటలకు తాగిన మత్తులోనే బైక్​పై బయటికెళ్లాడు. గండిమైసమ్మ వైపు వెళ్తుండగా.. సూరారం కట్టమైసమ్మ ఆలయం టర్నింగ్ వద్ద బైక్ అదుపుతప్పడంతో స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.