- అభ్యర్థుల్లో మహిళలే అధికం
కరీంనగర్, వెలుగు: ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే ఊరిలో పేరు మోసిన పెద్ద మనుషుల వ్యవహారంగా సాగేది. కానీ కాలం మారింది. దశాబ్ద కాలంగా విద్యావంతులు, వివిధ ప్రొఫెషనల్స్ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉన్న ఊరికి సేవ చేయాలని కొందరు, పాలిటిక్స్ లో తొలి అడుగు ఇక్కడి నుంచే వేయాలని మరికొందరు ముందుకొస్తున్నారు.
టీచర్లు, జర్నలిస్టులు, పోలీసులు, అంగన్ వాడీలు, ఆర్ఎంపీలు.. ఇలా పలు వృత్తుల్లో కొనసాగుతున్న వారితో పాటు లక్షల ఆదాయం వదులుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, అడ్వొకేట్లు కూడా ఊరి పెద్దగా పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి అభ్యర్థుల్లో ఎక్కువగా మహిళలే ఉండడం విశేషం.
టెకీల ఆసక్తి..
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్, కవయిత్రి మల్యాల జాహ్నవి నెలకు లక్షల్లో వచ్చే జీతాన్ని కాదనుకుని సర్పంచ్ గా బరిలో నిలిచారు. జాహ్నవి కేయూలో బీటెక్ చదివిన సమయంలో బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఓయూలో జర్మన్ లాంగ్వేజీ పీజీ డిప్లొమా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ చదివిన మానస నామినేషన్ వేశారు.
హైదరాబాద్ లో నెలకు రూ.లక్ష జీతంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్న ఆమె జాబ్ కు రిజైన్ చేశారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల సుప్రియ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా, భర్త వెల్మల హరీశ్‌రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేసి బిజినెస్ చేస్తున్నారు. లింగపేట్ సర్పంచ్ గా పోటీ చేసేందుకు సుప్రియ తన జాబ్ కు ఇటీవల రాజీనామా చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని జాడిజమాల్ పూర్ గ్రామానికి చెందిన శౌరి నిహారిక బీఎస్సీ, ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లోని అగ్రి షైన్ క్రాఫ్ట్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ.లక్ష శాలరీతో పనిచేస్తున్నారు. తన ఉద్యోగాన్ని వదిలేసి జాడిజమాల్ పూర్ సర్పంచ్ గా పోటీలో నిలిచారు.
ఉద్యోగాలు వదులుకుని..
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు ప్రస్తుతం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నారు. కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరిన ఆయన ప్రస్తుతం ఎస్సైగా ప్రమోషన్ పొందారు. ఇంకా ఆయనకు 5 నెలల సర్వీస్ ఉంది. తాజాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, రిజర్వేషన్ కలిసి రావడంతో గుడిబండ సర్పంచ్ గా పోటీ చేసేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటూనే మరోవైపు ఎన్నిక ఏకగ్రీవం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన గుండాల దీప్తి హైదరాబాద్ లోని విద్యాజ్యోతి కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశారు. అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తుండగా, రిజైన్ చేసి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఏడేళ్లుగా వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేసి కొట్లాడిన మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అదే మండలకేంద్రం నుంచి సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. ఎంసీఏ, ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తిచేసి ములుగులోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఆయన జాబ్ రిజైన్ చేసి నామినేషన్ వేశారు.
యూఎస్ నుంచి సొంతూరుకు..
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండేవారు. రూ.6 లక్షలు వేతనం వద్దనుకుని సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంతూరుకు వచ్చారు. తన తాత శంకరప్పఇదే గ్రామంలో 40 ఏండ్ల పాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన స్ఫూర్తితోనే సర్పంచ్ బరిలో నిలుస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు.
న్యాయస్థానం నుంచి రచ్చబండకు..
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ కు చెందిన మెతుకు హేమలత పటేల్ ఎంఏ ఎల్ఎల్బీ పూర్తి చేసి కరీంనగర్ కోర్టులో పదేళ్లుగా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే హేమలత ఫౌండేషన్ ద్వారా మహిళలు, పిల్లలకు మోటివేషన్ క్లాసేస్ చెబుతూనే ప్రజా సేవ చేస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు. సర్పంచ్ గా పోటీ నుంచి తప్పకోవాలని ఒత్తిళ్లు వస్తున్నా పట్టుదలతో పోటీలో నిలిచినట్లు హేమలత తెలిపారు.
పల్లె పోరులో విద్యావంతులు
ఈసారి ఉన్నత విద్యావంతులు సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన తాటి సుప్రియ ప్రస్తుతం హైదరాబాద్ లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇంజినీరింగ్ చేస్తూనే చింతగూడ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ముందుకొచ్చింది. తొర్రూరు మండలం వెలికట్టె సర్పంచ్ అభ్యర్థిగా బీఈడీ, ఎంఎస్సీ చేసి ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న బంధు శ్రీను బరిలో నిలిచారు. దంతాలపల్లి నుంచి ఎంఎస్సీ మైక్రో బయోలజీ చదివిన వీరబోయిన కిశోర్‌కుమార్, నెల్లికుదురు మండలం రావిరాల నుంచి ఎంటెక్ చదివిన కడారి ప్రశాంతి, నర్సింహులపేట నుంచి ఆర్ఎంపీ దూరు యాకయ్య, పెద్దమంగ్యా తండా నుంచి ఎంఏ, బీఈడీ పూర్తిచేసిన జాటోతు రమేశ్‌నాయక్ బరిలో ఉన్నారు.
