
రూ.2.50 కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం
సన్ టెక్నాలజీస్ సంస్థతో 25 ఏళ్లకు అగ్రిమెంట్
దేవస్థానానికి తగ్గనున్న విద్యుత్ బిల్లుల భారం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం ఇక సోలార్ వెలుగులతో మెరిసిపోనుంది. తెలంగాణ ఆర్టీసీ డిపోలు, ఆఫీసులకు సోలార్ విద్యుత్ అందించే సన్ టెక్నాలజీస్ సంస్థతోనే సీతారామచంద్రస్వామి దేవస్థానం అగ్రిమెంట్ చేసుకుంది. ప్రాజెక్టు విలువ రూ.2.50 కోట్లు. పెట్టుబడి పెట్టడంతోపాటు 25 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను సైతం నిర్మాణ సంస్థే తీసుకోనుంది. కేవలం విద్యుత్ బిల్లులను ఆ సంస్థకు దేవస్థానం చెల్లిస్తే చాలు. దీంతో దేవస్థానానికి కరెంటు బిల్లుల భారం భారీగా తగ్గనుంది. తెలంగాణలో సోలార్ విద్యుత్‍ను వినియోగించే తొలి దేవాలయంగా భద్రాచలం రామాలయం నిలవనుంది. త్వరగాప్రాజెక్టును ప్రారంభించి వచ్చే సీతారాముల కల్యాణం నాటికి సోలార్ వెలుగులు అందించాలని దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నెలకు రూ.7 లక్షల కరెంట్ బిల్లు
సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నెలకు రూ.7 లక్షల వరకు కరెంట్బిల్లు వస్తోంది. యూనిట్‍కు రూ.9 వరకు ఖర్చు అవుతోంది. దాదాపు రూ. 84 లక్షలను ఏడాదికి ట్రాన్స్ కోకు చెల్లించుకుంటోంది. అసలే అరకొర ఆదాయం. ఈ నేపథ్యంలో కరెంట్బిల్లులు దేవస్థానానికి పెనుభారంగా మారాయి. వార్షిక ఆదాయం ఏడాదికి రూ.50 కోట్లకు మించి లేదు. ఇటువంటి తరుణంలో ఖర్చులు తగ్గించుకునేందుకు దేవస్థానం అధికారులు ఆలోచనలు చేశారు. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన ఎండోమెంట్ కమిషనర్ అనిల్‍కుమార్ కు ఇక్కడి పరిస్థితులు వివరించి, సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఆయన గ్రీన్‍సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే పనులు చక్కబెట్టేశారు. సన్ టెక్నాలజీస్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ డిపోల్లో, ఆఫీసుల్లో సోలార్ విద్యుత్‍ను ఏర్పాటు చేస్తోంది. ఆ సంస్థతోనే దేవస్థానం అధికారులు సంప్రదింపులు జరిపారు. 25 ఏళ్లపాటు ఒకే రేటుకు యూనిట్ విద్యుత్‍ను ఇచ్చేందుకు సన్ టెక్నాలజీస్ అగ్రిమెంట్ చేసుకుంది. కరెంట్‌చార్జీలు ఎంత పెరిగినా దేవస్థానానికి సంబంధం లేదు. సంస్థ ప్రారంభంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే యూనిట్ ధరను చెల్లించనుంది. సోలార్ సిస్టమ్స్, సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకునే బాధ్యత ఆ సంస్థదే. దేవస్థానానికి పైసా ఖర్చు లేదు. రామాలయంతో పాటు, 27 కాటేజీలు, 140 రూమ్‌లు, నిత్యాన్నదాన సత్రం తదితర అన్నింటికీ సోలార్ వెలుగులు అందించనున్నారు. ఒక కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ల కరెంట్వినియోగానికి యూనిట్‍కు రూ.5.80, 11 కిలోవాట్ల నుంచి 100 కిలోవాట్ల వరకు యూనిట్‍కు రూ.5.50, 100 కిలోవాట్లపై వాడే విద్యుత్‍కు యూనిట్‍కు రూ.4.80 సంస్థ వసూలు చేయనుంది. ట్రాన్స్ కో ద్వారా పూర్తి వివరాలను దేవస్థానం సేకరించింది. రామాలయానికి నెలకు 400 కిలోవాట్ల కరెంట్అవసరం ఉంటుంది. ఇప్పుడు దేవస్థానం ట్రాన్స్ కోకు రూ.7 లక్షలు బిల్లు కడుతోంది. వీటిలో 40 శాతం వరకు బిల్లులు ఆదా అవుతాయి. అంటే నెలకు రూ.2.80 లక్షల మేర మిగులుతాయి.
ఖర్చు తగ్గుతుంది
సోలార్ కరెంట్‌తో దేవస్థానానికి బిల్లుల భారం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం నెలకు రూ.7 లక్షల వరకు బిల్లులు కడుతున్నాం. సోలార్ ప్రాజెక్టుకు దేవస్థానం పైసా ఖర్చు చేయనవసరం లేదు. ఖర్చు మొత్తం రూ.2.50 కోట్లు సన్‍టెక్నాలజీస్ సంస్థే భరిస్తుంది. 25 ఏళ్లపాటు నిర్వహణ ఆ సంస్థే చూసుకుంటుంది. యూనిట్ ధర కూడా 25 ఏళ్లూ ఒకే రకంగా ఉంటుంది. ఏడాదికి రూ.33.6 లక్షల వరకు ఆదా అవుతాయి.– శివాజీ, దేవస్థానం ఈవో