రేవంత్ మీటింగ్లో రచ్చ.. నాయకులకు సర్దిచెప్పిన టీపీసీసీ చీఫ్

రేవంత్ మీటింగ్లో రచ్చ.. నాయకులకు సర్దిచెప్పిన టీపీసీసీ చీఫ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సమావేశానికి వచ్చిన పలువురు పార్టీ నాయకులకు సర్ది చెప్పేందుకు రేవంత్ యత్నించారు. ‘‘ గొడవలు వద్దు..  సమావేశానికి సంబంధించినవి  కాకుండా ఇతర విషయాలు వద్దు. ఎజెండాకు లోబడే మాట్లాడండి.. ఓపిక పట్టండి’’ అని సూచించారు. 

రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి : జానారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎవరి మనుసును గాయపర్చవద్దు. ఐక్యంగా ముందుకు పోవాలి. రాహుల్ గాంధీ ని చూసి నేర్చుకోండి . భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడుతున్న విధానం చూడండి. ఆయన పార్టీ ఏందీ, ఈయన పార్టీ ఏందీ అని అనొద్దు . పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యం . అందరూ కలిసి ఉండడానికి కృషి చేయండి. కొత్తగా పార్టీ పదవుల్లో నియామకమైన వాళ్ళు.. అందరిని కలుపుకొని పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తం. మామధ్య ఎలాంటి విభేదాలు లేవు. సీనియర్ల మధ్య ఏర్పడిన గ్యాప్ ని పూడుస్తం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తం’’ అని వ్యాఖ్యానించారు. 

మీడియా ముందు పరువు తీస్తున్నరు : సీతక్క

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..  ‘‘ మేము ఈరోజు పార్టీ పదవులకు రాజీనామా చేసినం.  పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి పనిచేస్తాం . మాకు పార్టీ పదవులు అవసరం లేదు. నేను రాజస్థాన్ లో రాహుల్ తో కలిసి నడిచిన. పార్టీ నేతలను మానసికంగా దెబ్బతీయొద్దని.. నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని రాహుల్ ఆనాడు చెప్పారు. కానీ కొందరు పార్టీ నేతలు మీడియా ముందు మాట్లాడి పరువు తీస్తున్నారు. రాహుల్ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారు’’ అని కామెంట్ చేశారు.