కరోనాకు తోడు అకాలం : చేతికొచ్చిన పంట నేలపాలు

కరోనాకు తోడు అకాలం : చేతికొచ్చిన పంట నేలపాలు

వరి, జొన్న, మక్క, మామిడిపంటలకు తీవ్ర నష్టం

సంగారెడ్డి /మెదక్, వనపర్తి, వెలుగు : అసలే కరోనా ఎఫెక్ట్‌తో కూలీలు దొరక్క పంటను కోసేందుకు నానా తంటాలు పడుతున్న రైతులపై మరో పిడుగు పడింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో దాదాపు 8 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన వరి, జొన్న, మక్కజొన్న, మిర్చి పంటలు నేలపాలు కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. మామిడి తోటల్లోనూ కాయలు రాలి పోవడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా లో 950 ఎకరాల్లో…

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దాదాపు 950 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 700 ఎకరాలు సంగారెడ్డి జిల్లాలోనివేనని పేర్కొన్నారు. నారాయణఖేడ్, అందోల్,
సంగారెడ్డి అసెంబ్లీసెగ్మెంట్ పరిధిలోని పలు మండలాల్లో వరి, జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నయి. సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, జోగిపేట పట్టణాలలో గాలిదుమారంతో కూడా తోడు కావడంతో ఆస్తినష్టం తప్పలేదు. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కొన్ని
గ్రామాలు చీకట్లోనే ఉండిపోయాయి. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, టేక్మాల్, కొల్చారం, కౌడిపల్లి, రామాయంపేట, పెద్దశంకరంపేటలో చేతికొచ్చిన వరి నేలకొరిగింది. ఒక్క పాపన్నపేటలోనే 120 ఎకరాల పంట నష్టపోయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఉమ్మడి పాలమూరులో 5 వేల ఎకరాలకు పైగా..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌‌లోనూ వడగళ్ల‌ వాన బీభత్సం సృష్టించింది. వనపర్తిలో 3 వేల ఎకరాలు,
మహబూబ్‌నగర్‌‌, గద్వాలలో 2000 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోనే 840 ఎకరాల్లో వరి పంట నాశనం అయినట్లు గుర్తించారు. వనపర్తిలో వరి, మామిడి, గద్వాలలో వరితో పాటు మిర్చి పంట నష్ట పోయింది. కొన్ని చోట్ల కొనుగోల కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసి పోయింది. దీంతో రైతులు బుధవారం టార్ఫాలిన్లు, కవర్లు పరిచి ధాన్యాన్ని ఆరబెట్టారు.

యాదాద్రి జిల్లాలో 2 వేల ఎకరాల్లో..

యాదాద్రి, వెలుగు: అకాల వర్షం కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు నష్టపోయారు. మంగళవారం సాయంత్రం రాజాపేట, తుర్కపల్లి, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లో 2 వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నేల పాలయ్యింది. ఎకరాకు 30 క్వింటాళ్ల‌ చొప్పున దిగుబడి వస్తున్నందున సుమారు 60 వేల క్వింటాళ్ల‌ ధాన్యం రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం పంటల రూ. 11 కోట్లు ఉంటుంది. కాగా, గత నెలలో కురిసిన వడగండ్ల వర్షం కారణంగా 15708 ఎకరాల్లో రూ. 57 కోట్ల విలువైన పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బీబీ నగర్‌‌, చౌటుప్పల్‌ మండలాల్లో బుధవారం కూడా వర్షం కురిసింది.