ఈటల ఎఫెక్ట్​..మంత్రులకు జర్రంత స్వేచ్ఛ!

ఈటల ఎఫెక్ట్​..మంత్రులకు జర్రంత స్వేచ్ఛ!
  • నిన్నమొన్నటిదాక సొంత నియోజకవర్గాలకే పరిమితం
  • పక్క నియోజకవర్గంలోనూ అడుగుపెట్టలేని పరిస్థితి
  • ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు..
  • స్వయంగా వెంటబెట్టుకొని వెళ్తున్న కేటీఆర్

మంత్రులను కేసీఆర్​ బానిసలుగా చూస్తున్నరు.. మంత్రులకు స్వేచ్ఛనిస్తే కోఠిలో ఏకాన కొత్తలకు తనను అమ్ముకస్తరని పార్టీ మీటింగులనే సీఎం అన్నడు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పని చేస్తున్నడా.. ? రివ్యూలకు మంత్రులు, ఆఫీసర్లు సంతోషంగా వెళ్తున్నరా..? వాళ్లెవరికీ స్వేచ్ఛ, పవర్స్​​లేవు.. ఇది నూటికి నూరుపాళ్లు సత్యం. 
‑ ఈ నెల 4న టీఆర్​ఎస్​కు రాజీనామా చేస్తూ ఈటల రాజేందర్ అన్న మాటలివి.

ఈటల మాటల ఎఫెక్టో ఏమో కానీ మంత్రులకు ఇప్పుడు స్టేట్​ పర్మిషన్​ వచ్చినట్లయింది. నిన్నమొన్నటి దాకా సొంత నియోజకవర్గాలకే పరిమితమైన మినిస్టర్లు వారం పది రోజుల నుంచి రాష్ట్రమంతా తిరుగుతున్నరు. పక్క నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వెళ్తున్నరు. ఒకప్పుడు సీఎం, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్​కు మాత్రమే అన్ని జిల్లాల్లో తిరిగే స్వేచ్ఛ ఉండగా, ఇప్పుడు కేటీఆరే స్వయంగా ఇతర మంత్రులను వెంటబెట్టుకొని ప్రోగ్రాంలకు అటెండ్​ అవుతున్నరు. 

వెలుగు, నెట్​వర్క్: ఇన్నాళ్లూ హైదరాబాద్​లో జరిగే కేబినెట్​మీటింగులకు, లేదంటే సొంత నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకే  పరిమితమైన రాష్ట్ర మంత్రులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఒకానొకదశలో పక్క నియోజకవర్గాల్లోనూ అడుగుపెట్టే వీలు​లేక ‘సొంత నియోజకవర్గ మంత్రులు’ అనే ముద్రపడ్డవాళ్లకు ‘ఈటల ఎపిసోడ్’​ తర్వాతే ఇతర జిల్లాల్లో పర్యటించేందుకు ప్రగతిభవన్ నుంచి ​గ్రీన్​సిగ్నల్​వచ్చింది. సొంత నియోజకవర్గాలను దాటి ఇతర ప్రాంతాల్లో ప్రోగ్రాములకు వెళ్లే స్వేచ్ఛ ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్​, ఆయన కొడుకు, మంత్రి ​కేటీఆర్​కే ఉండేది. జిల్లాల్లో ఐటీ, మున్సిపల్​శాఖలకు సంబంధించిన ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు నిన్నమొన్నటి దాకా ఒంటరిగా వెళ్లిన కేటీఆర్ ఇప్పుడు తన నియోజకవర్గం సిరిసిల్లకు కూడా ఇతర మంత్రులను తీసుకుపోతున్నారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత ఈటల రాజేందర్​ చేసిన కామెంట్సే ఇందుకు కారణమని లీడర్లు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో మంత్రులెవరికీ స్వేచ్ఛ లేదని,  స్వతంత్రంగా ఉండడం సీఎం కేసీఆర్​కు ఇష్టం లేదని ఈటల రాజేందర్ ఈ నెల 4న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన టీఆర్​ఎస్​ హైకమాండ్​.. గంగుల కమలాకర్​సహా పలువురు మంత్రులతో ప్రెస్​మీట్లు పెట్టించి మరీ ఈటల మాటలను ఖండించేలా చూసింది. ఆ తర్వాతే మంత్రులకు స్టేట్​వైడ్ పర్యటించే స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తమ పవర్  సంగతి ఎలా ఉన్నా కనీసం స్టేట్​వైడ్​ పర్యటించే స్వేచ్ఛ దొరికినందుకు మంత్రులంతా లోలోపలే సంతోషపడుతున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే మంత్రులు!
ఫస్ట్  టర్మ్ ప్రభుత్వంలో మంత్రులకు అంతో ఇంతో స్వేచ్ఛ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చాక తన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా ‘ఎవరి నియోజకవర్గానికి వాళ్లే మంత్రి’ అంటూ ఎమ్మెల్యేలకు సూపర్ పవర్ ఇవ్వడంతోపాటు మంత్రులెవరూ వేరే నియోజకవర్గాల్లో వేలుపెట్టవద్దని ఇంటర్నల్ ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి మంత్రులంతా సొంత జిల్లాల్లోనే పరాయిలుగా మారిపోయారు. కేవలం తమ నియోజకవర్గాలకే మంత్రులుగా మిగిలిపోయారు. పక్క నియోజకవర్గాల్లో ఎంత పెద్ద ప్రారంభోత్సవం ఉన్నా, శంకుస్థాపన జరిగినా వెళ్లలేకపోయేవారు. మంత్రుల సొంత శాఖలకు సంబంధించిన కార్యక్రమమైనా ఇదే పరిస్థితి. ఇక ఇతర జిల్లాలవైపైతే కన్నెత్తి చూడకపోయేవాళ్లు. ఒక్క మంత్రి కేటీఆర్ కు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉండేది. కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం, మహబూబ్​నగర్​.. ఇలా వివిధ జిల్లాల్లో ఐటీ హబ్స్​శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు, మున్సిపల్​ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్లేవారు. మిగిలిన మంత్రులంతా అడపాదడపా హైదరాబాద్​లో జరిగే కేబినెట్​ మీటింగులకు, లేదంటే  సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యేవారు. కేబినెట్​లో  ఈటల తర్వాత సీనియర్​ మంత్రిగా పేరున్న మంత్రి హరీశ్​రావు కూడా మొన్నటివరకు సిద్దిపేట నియోజకవర్గం దాటి అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉండేది.

జిల్లా ఇన్​చార్జ్​ మంత్రుల విధానం రద్దు
గతంలో  ఇన్​చార్జ్​ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా పరిపాలనా యంత్రాంగానికి మధ్య వారధిగా ఉండేవారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుపై 3 నెలలకోసారి రివ్యూ నిర్వహించేవారు. తమ దృష్టికి తెచ్చే సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేవారు. టీఆర్​ఎస్​ ఫస్ట్​ టర్మ్​లో రెండు, మూడేండ్లపాటు మంత్రులకు జిల్లా ఇన్​చార్జ్​ తరహా పవర్స్​ ఇచ్చినా తర్వాత అధికారాలు వెనక్కి తీసుకున్నారు. క్రమంగా మంత్రులను వాళ్ల నియోజకవర్గాలకే పరిమితం చేయడంతో  నాలుగైదేండ్లుగా డిస్ట్రిక్ట్​ వైజ్​రివ్యూ మీటింగులు జరగట్లేదు. దీంతో జిల్లాల్లో డెవలప్​మెంట్ స్కీమ్​లల్లో ప్రోగ్రెస్​ లేకుండా పోయిందని, డిస్ట్రిక్​మినరల్​  డెవలప్​మెంట్​లాంటి ​ఫండ్స్ ​ఖర్చు కాకుండా మిగులున్నాయనే విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

సిరిసిల్లకు కొత్తగా మంత్రుల రాక
ఎన్నడూ లేనిది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఇతర శాఖల మంత్రులు అడుగుపెడుతున్నారు. సీఎం కేసీఆర్​ కొడుకు, టీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించినా, ఆయన సొంత నియోజకవర్గంలో మాత్రం ఇతర మంత్రులు అడుగు పెట్టాలంటే జంకుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన ఏడేండ్లలో ఒక్క పోచారం శ్రీనివాస్​రెడ్డి తప్ప ఇతర మంత్రులు సిరిసిల్లలో పర్యటించలేదు. కానీ ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత మంత్రి కేటీఆరే స్వయంగా ఆయా శాఖల మంత్రులను వెంటబెట్టుకొని వస్తున్నారు. ఈ నెల 16న జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , రైతు వేదికల ప్రారంభోత్సవానికి హౌసింగ్​, ఆర్​అండ్​బీ మినిస్టర్​మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కేటీఆర్​ తీసుకొచ్చారు. 

ఈటల మాటల తర్వాత సీన్​ చేంజ్​
రాష్ట్రంలో మంత్రులకు స్వేచ్ఛ లేదంటూ ఈటల రాజేందర్​ మాట్లాడిన తర్వాత  సీన్​ మారింది. జిల్లాల్లో రైతు వేదికల ప్రారంభోత్సవాలకు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, రోడ్లు, కలెక్టరేట్లు, డబుల్ ​బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవాలకు ఆర్​అండ్​బీ, హౌసింగ్​ మంత్రి  వేముల ప్రశాంత్​రెడ్డి, ఎండోమెంట్​ కార్యక్రమాలకు మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి.. ఇలా  మంత్రులందరూ ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిన్నమొన్నటి దాక సిద్దిపేటకే పరిమితమైన హరీశ్​రావు ఇప్పుడు ఉమ్మడి మెదక్​ను చుట్టి వస్తున్నారు. ఈ నెల 13న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొడకండ్ల గ్రామంలో డబుల్ ఇండ్ల ప్రారంభోత్సవానికి హాజరైన హరీశ్​.. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను వెంటబెట్టుకొని వెళ్లారు. సూర్యాపేట జిల్లా దాటి రాని మంత్రి జగదీశ్​రెడ్డి ఈ నెల 12న యాదాద్రి వచ్చి గుట్టపై లైటింగ్ పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.  వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల ప్రారంభోత్సవాలకు వెళ్తున్నారు. ఈ నెల 16న వరంగల్ అర్బన్  జిల్లాకు వచ్చిన నిరంజన్ రెడ్డి స్టేషన్  ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఏకంగా ఎనిమిది రైతు వేదికలను ప్రారంభించారు. ఇక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, గంగుల కమలాకర్​ల​కు హైకమాండ్​ ‘ఆపరేషన్​ ఆకర్ష్’​ బాధ్యతలు అప్పగించింది. ఎర్రబెల్లి టీటీడీపీ ప్రెసిడెంట్ రమణను కారెక్కించే పనిలో ఉండగా, హుజూరాబాద్​ నియోజకవర్గంపై ఫోకస్ ​పెట్టిన గంగుల కమలాకర్ ఈట ల అనుచరులను టీఆర్​ఎస్​లోకి లాగే పనిలో బిజీ అయ్యారు. మహబూబాబాద్​ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ పక్క జిల్లాలో అడుగుపెట్టడం అరుదు. అలాంటిది ఈ నెల 16న  భూపాలపల్లి జిల్లాలో పర్యటించి దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఇంతకాలం నిర్మల్ జిల్లాకే పరిమితమైన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు.