సిటీని వీడని నీళ్లు..ఆగని కన్నీళ్లు

సిటీని వీడని నీళ్లు..ఆగని కన్నీళ్లు

వరుస వానలు సిటీని అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉండిపోయాయి. ఇంకా వరద నీరు వీడడం లేదు. బాధితుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. అన్నీ కోల్పోయిన వారికి ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు.  – హైదరాబాద్, వెలుగు

.

వరద ఏరియాల్లో సీపీల పర్యటన

వరద ముంపు ప్రాంతాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్  ఆదివారం పర్యటించారు. నీట మునిగిన కాలనీలు, డ్యామేజ్ అయిన రోడ్లు, చెరువుల ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. ఓల్డ్​సిటీని ముంచెత్తుతున్న పల్లెచెరువు, అప్పా చెరువు లు సహా గగన్‌పహాడ్‌, అలీనగర్, సుభాన్ కాలనీ, కింగ్స్ కాలనీల్లో సైబరాబాద్ సీపీ పర్యటించి సహాయక చర్యలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఫలక్‌నుమా, చాంద్రాయణ గుట్ట, మంగార్‌‌ బస్తీ వరద ముంపు ప్రాంతాల్లో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌‌ పర్యటించారు.  ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జిపై  రిపేర్లు పూర్తయ్యే వరకు క్లోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు