కత్తులు, తుపాకులు పట్టుకోవడం రాజ్యాంగ స్ఫూర్తా?

కత్తులు, తుపాకులు పట్టుకోవడం రాజ్యాంగ స్ఫూర్తా?

కొందరు రాజకీయ స్వార్థం కోసం...పది మందికి పదవులను దక్కించుకునేందుకు  దేశంలో మత పిచ్చి లేపుతున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. కర్ణాటకలో హిజాబ్, హలాల్ వివాదాలు జరుగుతుండటంపై దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. బెంగళూరులో ప్రత్యక్షంగా 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నారు. మత విద్వేషాలు ప్రేరేపించేవారు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన 13 కోట్ల మంది ప్రజలు స్వదేశానికి తిరిగి వస్తే పరిస్థితి ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. గాంధీని విమర్శించి .. ఆయన్ని చంపిన వారిని ప్రశంసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ రాజధానిలో కత్తులు, తుపాకులు పట్టుకుని మృగాలుగా తిరగడం రాజ్యాంగ స్ఫూర్తా అని కేసీఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యంగం అమలుకావాలంటే దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఉందన్నారు.మానిన గాయాలను మళ్లీ మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని కశ్మీర్ పండిట్స్ మాట్లాడుతున్నారని చెప్పారు. దేశంలో దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థ ఉందన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో గవర్నర్ల పంచాయితీ ఉందని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థతో ఎన్టీఆర్ ని పదవి నుంచి తొలగిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజలు మళ్లీ ఎన్టీఆర్ ని సీఎం చేశారన్నారు.