తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు.. ఏ రోజు ఏ సేవ ఉంటుందంటే..! 

తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు.. ఏ రోజు ఏ సేవ ఉంటుందంటే..! 
  • ఈనెల 26 నుండి తిరుమలలో తెప్పోత్సవాలు...
  • మార్చి 2వ తేదీ వరకు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

కలియుగ వైకుంఠం తిరుమల మరో ఉత్సవానికి సిద్దమవుతోంది. తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ.  మార్చి 2వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 నుంచి 08 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. విద్యుత్ దీప కాంతులలో ఐదు రోజులపాటు నేత్రపర్వంగా సాగనున్నాయి తెప్పోత్సవాలు.  

ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారు. 

తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తునే ఉంటారు. అందులో పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవానికి కూడా ప్రత్యేకత ఉంది. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో 'తిరుపల్లి ఓడై తిరునాళ్‌', తెలుగులో 'తెప్ప తిరునాళ్లు అంటారు. 

తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో "నీరాళి మండపాన్ని" నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

 

  •  తెప్పోత్సవాల్లో తొలిరోజు ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. 
  • రెండవ రోజు ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
  • మూడవరోజు ఫిబ్రవరి 28న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. 
  •  శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 01న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 02వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను దర్శనమిస్తారు.

తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,  27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది