- 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా పార్టీ నేతలకు తెలుసు: మహేశ్ గౌడ్
- ఏఐసీసీ దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ చీఫ్
- సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటపెడ్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తాను, సీఎం రేవంత్ కలిసి పనిచేయడం కొందరికి మింగుడు పడడం లేదని, అందుకే తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్మహేశ్గౌడ్మండిపడ్డారు. ‘‘పీసీసీ చీఫ్ గా గత 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా పార్టీ నేతలకు తెలుసు.. నేను ఎలా పనిచేస్తున్నాననేది అంచనా వేసేది మా సీఎం, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే. ఏదో ఓ న్యూస్ చానెల్ లో నాపై వచ్చిన వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదు.
జిల్లాల్లో మా పార్టీ నాయకులకు కూడా ఇదే చెప్పాను. ఆ వార్తను ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు’’ అని చెప్పారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత చిట్ చాట్ చేశారు. ఏఐసీసీ దృష్టిలో ‘తెలంగాణ పీసీసీ చీఫ్ ద బెస్ట్ ’అని ఉందన్నారు. స్వయంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తన పనితీరును ప్రశంసించారని మహేశ్‌గౌడ్ వివరించారు.
‘‘ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్లు గతంలో నా పనితీరును ప్రశంసిస్తూ వార్తలు ఇచ్చారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటపెడ్తా” అని అన్నారు. గాంధీ భవన్ నిర్వహణను ట్రస్టు చూసుకుంటుందని, ఆ భవనం వెనుకాల ఉన్న స్థలంలో ఏమైనా జరిగితే దాన్ని కూడా పార్టీ ఆఫీసుకు ఆపాదిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్ట్ ను ఏఐసీసీకి పంపించానని, దాన్ని హైకమాండ్ పరిశీలించి ఫైనల్ చేస్తుందన్నారు. అప్పటివరకు పీసీసీ చీఫ్‌గా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. ‘‘ఇదేమి ప్రాంతీయ పార్టీ కాదు. వర్కింగ్ ప్రెసిడెంట్లను నేను ప్రకటించడానికి.
కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఇక్కడే, ఇప్పటికిప్పుడు నిర్ణయాలు మా పార్టీలో ఉండవు’’ అని స్పష్టంచేశారు. కేబినెట్ విస్తరణ అనేది సీఎం పరిధిలోని అంశమని, అందులో పీసీసీ జోక్యం ఉండదని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ మార్పు అనేది కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
బీఆర్ఎస్ వచ్చేది లేదు.. ఫ్యూచర్‌సిటీని రద్దు చేసేది లేదు..
తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీశ్ రావు కామెంట్స్‌పై మహేశ్‌గౌడ్ మండిపడ్డారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు.. ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది లేదు’’ అని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తలమానికం అని, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా సిటీని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
నగరంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, తగినంత భూమి, భద్రత ఉంటే విదేశీ పెట్టుబడులు తరలివస్తాయని చెప్పారు. అన్ని హంగులతో, సకల సదుపాయాలతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే ఈ సిటీ వల్ల రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పీసీసీ చీఫ్ చెప్పారు.
బహుశా బీఆర్‌ఎస్ నేతలకు హైదరాబాద్ అభివృద్ధి చెందడం ఇష్టం లేదేమోనని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆదుకోవడం దెవుడెరుగు. విభజన హామీలను తీర్చలేని దుస్థితిలో కేంద్రం ఉందని విమర్శించారు.
