
మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టారు. తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు.
ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక ప్రచారాలు సాగాయి. బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ ..తన ముఖ్యసలహాదారుగా నియమించుకోవడం విశేషం.
ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించినా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ - క్యాట్ ఉత్తర్వులతో సోమేష్ కుమార్ రాష్ట్రంలోనే కొనసాగారు. ఆ సమయంలో ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా.., అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టులో డీవోపీటీ సవాల్ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన హైకోర్టు ఆయన్ను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం లేక పోవడంతో సోమేష్ కుమార్ ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన సోమేష్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏపీ సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. సోమేశ్ దరఖాస్తును డీవోపీటీ అంగీకరించింది. దీంతో ఆయనకు సలహాదారు పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటు. సోమేష్ కుమార్ స్వస్థలం బీహార్. సోమేష్ కుమార్ కి బిహార్ లోని రాజకీయలపై మంచి పట్టు ఉంది. ప్రశాంత్ కిషోర్ తో చనువు ఉంది. అటు దేశ రాజకీయాలపై కూడా పూర్తిస్థాయి అవగాహన ఉంది. సర్వేల ఇన్ పుట్స్ సోమేష్ కుమారమే ఎప్పటికప్పుడు కేసీఆర్ కి చెబుతుంటారని టాక్. అయితే ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డ సోమేష్ కుమార్..పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ లోనే ఎదో ఒక స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దింపవచ్చని తెలుస్తోంది.