‘ధరణి‘ ఓపెన్ కోసం గంటన్నర వెయిట్​ చేసిన సీఎస్​

‘ధరణి‘ ఓపెన్ కోసం గంటన్నర వెయిట్​ చేసిన సీఎస్​
  •     శంషాబాద్​ తహసీల్దార్​ ఆఫీసులో రిజిస్ట్రేషన్ల ఓపెనింగ్​ కోసం వెళ్లిన సోమేశ్​
  •     సర్వర్​ సమస్య రెండు, మూడు రోజుల్లో సర్దుకుంటుందని వివరణ
  •     వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై త్వరలో సీఎం ప్రకటన చేస్తారని వెల్లడి

హైదరాబాద్, వెలుగురాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన ‘ధరణి’ వెబ్​సైట్​ సమస్య చీఫ్​ సెక్రెటరీ సోమేశ్​కుమార్​ను కూడా వెయిట్​ చేయించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి సేవలు ప్రారంభించేందుకు వెళ్లిన సీఎస్.. ధరణి పోర్టల్​ సతాయించడంతో గంటన్నరకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి చక్కబడటంతో ధరణి సేవలను ప్రారంభించి, అక్కడి తొలి రిజిస్ట్రేషన్​ను పూర్తి చేశారు. గిఫ్ట్​ డీడ్​ కింద చేసిన ఈ రిజిస్ట్రేషన్ పేపర్లను మంచాల ప్రశాంతి అనే మహిళకు అందజేశారు. తర్వాత సీఎస్​ సోమేశ్​ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా​ధరణి సేవలు మొదలయ్యాయని, దీని ద్వారా రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. మొదటిరోజు కాబట్టి అక్కడక్కడా చిన్న చిన్న టెక్నికల్​ సమస్యలు ఉంటాయని, రెండు మూడు రోజుల్లో అంతా సెట్​ అవుతుందని తెలిపారు. సోమవారం పొద్దున 10.30 గంటల వరకు 946 మంది రిజిస్ట్రేషన్ల కోసం సొమ్ము చెల్లించగా.. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని వివరించారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని 570 మండలాల్లో ధరణి సేవలు అందుబాటులో వచ్చాయని, ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలను ధరణిలో ఉంచామని వివరించారు.రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ను మీసేవ కేంద్రాల ద్వారా రూ.200 చెల్లించి చేసుకోవచ్చని, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని వివరించారు. భూముల అమ్మకాలు, గిఫ్ట్ డీడ్​లు, మరణించిన వారి వారసులకు రిజిస్ట్రేషన్, ఫ్యామిలీ పార్టీషన్ రిజిస్ట్రేషన్లు సోమవారం మొదలయ్యాయని.. నాలా, పాత రిజిస్ట్రేషన్లు, పాత మ్యుటేషన్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై త్వరలోనే సీఎం కేసీఆర్​ ప్రకటన చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్ ప్రింట్లకు సంబంధించి సమస్య వస్తే.. ఐరిస్​(కళ్ల స్కానింగ్) ద్వారా చేస్తారని తెలిపారు.