
మొగుళ్లపల్లి, వెలుగు: అన్నం పెట్టలేదనే కోపంతో తల్లిని రోకలి బండతో కొడుకు కొట్టడంతో, తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ చనిపోయింది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలకు చెందిన అప్పం రాజఎల్లయ్య, సమ్మక్క దంపతులకు ముగ్గురు కొడుకులు. కొన్ని నెలల కింద తండ్రి రాజ ఎల్లయ్య చనిపోయాడు. పెద్ద కొడుకు రాజ్‌కుమార్ భార్యతో విడిపోవడంతో ఏ పని చేయకుండా తిరుగుతూ తల్లి వద్దే ఉంటున్నాడు.
ఈనెల 26న సాయంత్రం సమ్మక్క(59) ఇంటి ముందు ఉన్న బల్లపై పడుకోగా, అన్నం పెట్టలేదనే కోపంతో రాజ్ కుమార్ ఆమెను రోకలి బండతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. రెండో కొడుకు అశోక్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి, రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.