తాగొచ్చి తల్లిని వేధిస్తుండని..తండ్రిని చంపిన కొడుకు

తాగొచ్చి తల్లిని వేధిస్తుండని..తండ్రిని చంపిన కొడుకు

చందానగర్​,  వెలుగు : డెయిలీ మద్యం తాగి వచ్చి తల్లిని, కుటుంబ సభ్యులను కొడుతూ వేధిస్తున్న తండ్రిని సెంట్రింగ్​ చెక్కతో కొట్టి చంపాడో కొడుకు. ఈ ఘటన హైదరాబాద్​లోని మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​లో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాలపూర్​ గ్రామానికి చెందిన వంగలి దస్తమ్మ, పెద్ద డేనియల్​(60)  కుటుంబంతో కలిసి 10 సంవత్సరాల కింద నగరానికి వచ్చి మియాపూర్​ సుభాష్​ చంద్రబోస్​నగర్​లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొద్దిరోజులుగా డేనియల్​ ఒకరోజు కూలి పనికి వెళ్లి నాలుగు రోజులు ఇంట్లోనే ఉంటున్నాడు.

 భార్యను కూడా పనికి వెళ్లనివ్వడం లేదు. పైగా   డెయిలీ తాగొచ్చి భార్యను కొడుతున్నాడు.  అడ్డు వచ్చిన కుటుంబసభ్యులను కూడా కొడుతూ తిడుతున్నాడు. ఈ నెల 24న ఉదయం భార్యను కూలి  పనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో దస్తమ్మ తన పెద్ద కొడుకు ఖాసీంకు జరిగిన విషయాన్ని ఫోన్​ చేసి చెప్పింది. టీ షాప్​ నిర్వహించే ఖాసీం వెంటనే ఇంటికి వచ్చి తల్లిని ఎందుకు కొడుతున్నావ్​ అని నిలదీశాడు. డేనియాల్​ కొడుకుపై దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. తండ్రితో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన ఖాసీం, అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో సెంట్రింగ్​ చెక్కతో తండ్రి తలపై కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన డేనియల్​ను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం 6 గంటలకు మియాపూర్​ పోలీసులు నిందితుడు ఖాసీంను మియాపూర్​ క్రాస్​ రోడ్డు వద్ద అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.