కోల్‌కతా: బెంగాల్లో రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)తో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా విడిపోయిన ఓ కుటుంబాన్ని ‘సర్’ తిరిగి కలిపింది. చక్రవర్తి పెద్ద కుమారుడు వివేక్ చక్రవర్తి 1988లో 37 ఏండ్ల క్రితం తప్పిపోయాడు. అనంతరం కోల్‌కతాలోని గోబోరాండ గ్రామంలో స్థిరపడ్డాడు. ఎన్నేండ్లు వెతికినప్పటికీ అతడి ఆచూకీని చక్రవర్తి దంపతులు కనిపెట్టలేకపోయారు.
అటువంటి సమయంలోనే ‘సర్’ ప్రక్రియ వారి కుటుంబంలో అనుకోని మలుపు తిప్పింది. వివేక్ చక్రవర్తి సోదరుడు ప్రదీప్ చక్రవర్తి అతడి ప్రాంతానికి బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)గా పని చేస్తున్నాడు. అక్కడ సర్ ప్రక్రియ కొనసాగుతుండటంతో అతడి పేరు, ఫోన్ నంబర్ ఆ ప్రాంతంలో పంపిణీ చేసిన ప్రతి ఎన్యుమరేషన్ ఫారమ్‌లో ప్రచురించారు. ఈ క్రమంలోనే వివేక్ కుమారుడు డాక్యుమెంటేషన్ సహాయం కోరుతూ బీఎల్వో ప్రదీప్‌కు ఫోన్ చేశాడు.
అనంతరం మాటల్లో వివరాలు అడిగి తెలుసుకున్నాక తమది ఒకే కుటుంబమని వారు గ్రహించారు. తన సొంత అన్న కొడుకుతో మాట్లాడుతున్నానని ప్రదీప్ తెలుసుకున్నాడు. ఆపై ప్రదీప్ తన సోదరుడు వివేక్‌తో మాట్లాడాడు. 37 ఏండ్ల తర్వాత ఇద్దరు సోదరులు ఒకరితో మరొకరు మాట్లాడుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా వివేక్ ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు చెప్పాడు. ‘సర్’ ప్రక్రియ లేకుంటే తన కుటుంబాన్ని ఎప్పుడు కలుసుకుని ఉండేవాడిని కాదని పేర్కొన్నాడు.
