పార్టీ రుణం తీర్చుకోండి..

పార్టీ రుణం తీర్చుకోండి..

ఢిల్లీ : ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీలో కీలక అంశాలపై చర్చించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ నేతలకు కాంగ్రెస్ చీఫ్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 13, 14, 15వ తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు, పదవులు చేపట్టిన వ్యక్తులు హాజరుకానున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఎన్నికల్లో ఓటములపై ప్రధానంగా చర్చించనున్నారు. ‘మిషన్ 2024’ పేరుతో కాంగ్రెస్ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలన్నది అధిష్టానం వ్యూహం. ఇందుకు సంబంధించిన అజెండాను రూపొందించేందుకు సీడబ్ల్యూసీ సమావేశమైంది. 

కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందని, ఇప్పుడు పార్టీకి ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించుకునే అవకాశం, సమయం వచ్చిందని సోనియాగాంధీ అన్నారు. ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనుల గురించి, పార్టీ గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ఎన్నికలు, సైద్దాంతిపరంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి పార్టీని పునర్ నిర్మించే కార్యక్రమంగా నిలపాలన్నారు. పార్టీ పునరుద్ధరణకు నేతల మధ్య ఐక్యమత్యం, సంకల్పం, నిబద్ధత కలిగి ఉండాలని సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. జాతీయ స్థాయితో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రెబల్ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ ఈ కామెంట్స్ చేశారు. 

చింతన్ శిబిర్ అజెండాను రూపొందించడంతో పాటు పార్టీలో వ్యవస్థాగతంగా చేయాల్సిన మార్పులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. వివిధ స్థానాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, ప్రస్తుతం మహిళలకు ఉన్న 33 శాతం రిజర్వేషన్లు, జిల్లా స్థాయిలో అధిపతులను నియమించే అధికారాన్ని రాష్ర్ట స్థాయికి కట్టబెట్టడం, బీజేపీని అధిగమించే వ్యూహాలపైనా చర్చించారు. 


 

 

మరిన్ని వార్తల కోసం.. 

ప్రిన్స్ మూవీకి టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాల కోసం సర్పంచ్ భిక్షాటన