సోనియా నిస్వార్థ సాధకురాలు .. నేడు సోనియా గాంధీ జన్మదినం

సోనియా నిస్వార్థ సాధకురాలు .. నేడు  సోనియా గాంధీ జన్మదినం

సోనియా గాంధీ రాజీవ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు,  ఆమెకు రాజీవ్  ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలియదు. ఎందుకంటే భారత దేశంలో అత్యున్నత పదవిలో కొనసాగిన వ్యక్తుల సంతానానికి సంబంధించిన క్రెడెన్షియల్ దాస్తారు. అది మన రాజ్యాంగం కల్పించిన భద్రతా చర్యల్లో భాగం. కనుక చదువుకుంటున్న రోజుల్లో, విద్యాసంస్థలో సోనియా, రాజీవ్​ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లిపీటల వరకు వచ్చింది. సోనియా ఇండియాలో అడుగుపెట్టినప్పుడు సాధారణ గృహిణి. కేవలం రాజీవ్ గాంధీ భార్యగా, ఒక ఇటాలియన్​గా మాత్రమే భారతీయులకు తెలుసు. రాజీవ్ విషాద మరణం, తదనంతర రాజకీయాల పరిణామాల వలన, ప్రధాని పీవీ నరసింహారావు ప్రధాని కావడం, ఆ తర్వాత కాలంలో  కాంగ్రెస్​ చిక్కిశల్యమైనది. అలాంటి అసాధారణ పరిస్థితుల్లో  సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టి, భారతదేశ రాజకీయ రంగంలోకి నేరుగా ప్రవేశించారు. ‘విదేశీ వనిత’  అనే కారణంతో బీజేపీ లాంటి ప్రధాన రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను సవినయంగా స్వీకరించి ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేశారు.  క్రియాశీలక రాజకీయాల్లో  కొనసాగారు.

దార్శినికురాలు

ఏకస్వామ్య పార్టీ పాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాలకు రాజకీయాలు శరవేగంగా మారిన పరిస్థితులకు తగినట్టు, సోనియా  రాజకీయ నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీని కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది భారత దేశాన్ని ప్రబల ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు నిలిపే ఉద్దేశంతో ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్​ను ప్రధానిగా నియమించారు. 2009 కాలంలో అమెరికా లాంటి శక్తులు కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటే, కేవలం ఇండియా మాత్రమే ఆ ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా నిలబడింది. ఈ రోజు ఇండియా ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అంటే, అది ఆనాటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ పాలన దక్షత, సోనియా గాంధీ దార్శనికత కూడా పనిచేశాయని చెప్పాలి. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ ‘123 అణు ఒప్పందాన్ని’ తీసుకువస్తే బీజేపీతో సహా, యుపీఏలో భాగస్వాములైన వామపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. కమ్యూనిస్టులు ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. అయినా ఒప్పందాన్ని అమలు పరచి, ఇండియాను అణుశక్తి రంగంలో స్వావలంబన దిశగా నిలబెట్టడంలో సోనియా కీలక పాత్ర ఉన్నది.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ

యూపీఏ హాయాంలో  ‘మహాత్మా గాంధీ జాతీయ పనికి ఆహార పథకం ’ దేశంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు పని కల్పించింది.  ‘ఆధార్ ’ ప్రవేశపెట్టి సంస్కరణలకు సోనియా గాంధీ నాంది పలికారు. ఆ రోజుల్లోనే మహిళా రిజర్వేషన్స్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టి, మహిళా సాధికారతకు బీజాలు వేశారు. యుపీఏ  చైర్ పర్సన్​గా క్రియాశీలక పాత్ర వహించి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మద్దతుతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేశారు. ఆంధ్రా లాబియింగ్​కు లొంగిపొకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రజలకు అందించిన విశేష సేవలను గుర్తు చేసుకోవడం సహజ పరిణామం.  

- రామకృష్ణ మనిమద్దె, రీసెర్చ్ స్కాలర్, ఓయూ