CWC మీటింగ్..మధ్యలోనే వెళ్లిపోయిన సోనియా,రాహుల్

CWC మీటింగ్..మధ్యలోనే వెళ్లిపోయిన సోనియా,రాహుల్

కొత్త  అధ్యక్షుడి ఎంపిక  కోసం  కాంగ్రెస్  వర్కింగ్  కమిటీ  సమావేశమైంది.  భేటీలో  అధ్యక్షుడి  ఎంపికపై  కసరత్తు చేశారు.  వర్కింగ్  కమిటీ  సభ్యులంతా  ఈ భేటీకి  హాజరయ్యారు. కొత్త  అధ్యక్షున్ని  ఎన్నుకునేందుకు  5  టీములుగా  విడిపోయిన  నేతలు  ఒకరిని  ఫైనలైజ్  చేసే  అవకాశం  ఉంది.  మొదట  తాత్కాలిక  అధ్యక్షుడిని ఎన్నుకుని  ఆ తర్వాత  అంతర్గత  ఎన్నికలు  నిర్వహించి  పూర్తిస్థాయి  కాంగ్రెస్  ప్రెసిడెంట్ ను  ఎంపిక  చేస్తారన్న ప్రచారం  కూడా  జరుగుతోంది.  అయితే  రెండుసార్లు  అధ్యక్షపదవికి  ఎంపిక  చేయడం  కరెక్ట్  కాదన్న  వాదన సీడబ్ల్యూసీలో  వ్యక్తమైంది.  విస్తృత సంప్రదింపులు,  చర్చల  తర్వాతే  కొత్త  అధ్యక్షుడిని  ఎన్నుకోవాలని  కాంగ్రెస్ నేతలకు  రాహుల్  గాంధీ  సూచించినట్లు  చెబుతున్నారు.  ఆ ప్రకారమే  కొత్త  అధ్యక్షుడి  ఎంపిక  కొనసాగుతుందని పార్టీ  వర్గాలంటున్నాయి.  ఉత్తర,  దక్షిణ,  తూర్పు,  పశ్చిమ,  ఈశాన్య  రాష్ట్రాల  కాంగ్రెస్  నేతలతో  సంప్రదింపులు జరుపుతున్నారు.  అయితే  ఈ సంప్రదింపుల  నుంచి  సోనియాగాంధీ,  రాహుల్  గాంధీ  తప్పుకున్నారు.  తర్వాతి అధ్యక్షుడిని  మిగితా  నేతలే  స్వేచ్ఛగా  ఎంపిక  చేసేందుకే  తాము  బయటకు  వెళ్తున్నట్లు  సోనియా  చెప్పారు.

కాంగ్రెస్  పార్టీ  అధ్యక్ష  రేసులో  ముకుల్  వాస్నిక్,  మల్లికార్జున  ఖర్గే,  సుశీల్  కుమార్  షిండే  వంటి  నేతల  పేర్లు వినిపిస్తున్నాయి.  యువ  నేతలైన  జ్యోతిరాదిత్య,  సచిన్  పైలెట్  పేర్లూ  తెరపైకి  వచ్చాయి.  సంప్రదింపుల  ద్వారా కాంగ్రెస్  అధ్యక్ష  పదవికి  ఎవరు  సరిపోతారో  నిర్ధారించనున్నారు.  పార్టీలో  అంతర్గతంగా  ఎన్నికలు  నిర్వహిస్తే… నాయకులు  రెండు  వర్గాలుగా  విడిపోయే  ప్రమాదం  ఉందని  కొందరు  నేతలు  సూచించడంతో  సంప్రదింపులతోనే తేల్చేయాలని  నిర్ణయించారు.  మరోవైపు  కాంగ్రెస్  కొత్త  అధ్యక్షుడికి  చాలా  సవాళ్లు  ఉన్నాయి.  ఈ ఏడాది  చివర్లో 4  రాష్ట్రాల్లో  ఎన్నికలు  ఉన్నాయి.  బీజేపీ  ఇప్పటికే  ఎలక్షన్  ఇంఛార్జులను నియమించి  వ్యూహాలు  అమలు చేస్తోంది.  కాంగ్రెస్  ఇక  వెనకబడకూడదంటే  ఆ ఎన్నికలను  సమర్థంగా  ఎదుర్కోవడం,  విజయాల  శాతం  పెంచే నాయకుడి  ఎంపిక  కీలకం  కానుంది.