ముగిసిన సోనియా గాంధీ తొలిరోజు విచారణ

ముగిసిన సోనియా గాంధీ తొలిరోజు విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిరోజు విచారణ పూర్తైంది. ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు ఆమెను విచారించారు. మొత్తం 3 సెషన్లలో సోనియాను ఈడీ ప్రశ్నించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తదుపరి విచారణకు ఎప్పుడు జరగనుందన్న అంశంపై స్పష్టత రాలేదు. సోనియా గాంధీని మహిళా అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు ఈఫీసర్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి కోసం దర్యాప్తు సంస్థ 50 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం.

సోనియా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు సాయంగా ఉండేందుకు ఈడీ ప్రియాంక గాంధీకి అనుమతిచ్చింది. అయితే విచారణ జరుపుతున్న గదిలో కాకుండా మరో రూంలో ఉండేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు వరకు సోనియా, ప్రియాంక వెంట రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. వారిద్దరూ ఆఫీసులోకి వెళ్లగానే రాహుల్ అక్కడ్నుంచి వెనుదిరిగారు. సెకండ్ సెషన్ లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి.. థర్డ్ సెషన్ లో కాంగ్రెస్ పార్టీతో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో ఉన్న సంబంధాలగురించి ప్రశ్నించనున్నారు.

ఇదిలాఉంటే సోనియాగాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు బయట, లోపల కూడా ఆందోళనలు జరిగాయి. సోనియా గాంధీకి మద్దతుగా ఈడీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు అధికారులు. సోనియాగాంధీ ఈడీ విచారణ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను పెంచారు. ఔరంగాజేబ్ మార్గ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, జన్ పథ్ మార్గ్, అక్బర్ రోడ్డలను పూర్తిగా మూసివేశారు. ఈడీ ఆఫీస్, ఏఐసీసీ ఆఫీస్ దగ్గర పెద్దసంఖ్యలో బలగాలు మోహరించారు. సోనియా ఈడీ విచారణను నిరసిస్తూ  అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగాయి.