
కరోనా కష్టకాలంలో వేలాది మందికి సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ ప్రస్తుతం వరుస లీడ్ రోల్స్‌లో నటిస్తున్నాడు. సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా వైభవ్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఫతే’. జీ స్టూడియోస్ సమర్పణలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇదొక సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని పంజాబ్‌లోని అమృతసర్‌లో శనివారం ప్రారంభించారు. షూటింగ్‌కు ముందు సోనూ సూద్, జాక్వెలిన్ వివిధ వర్క్ షాప్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ ‘ సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమా రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. లాక్‌డౌన్ టైమ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పాడు. స్ర్కిప్ట్ విన్నప్పుడే ఇలాంటి మంచి చిత్రంలో నటించాలనే ఇంటరెస్ట్ కలిగిందని చెప్పింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామన్నారు నిర్మాతలు.