త్వరలో 8 కొత్త మెడికల్ కాలేజీలు

త్వరలో 8 కొత్త  మెడికల్ కాలేజీలు
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన మెడికల్ ఎడ్యుకేషన్ 
  • ఖమ్మం, కరీంనగర్‌‌‌‌, ఆసిఫాబాద్‌‌, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు 
  • రాష్ట్ర సర్కార్​కు ఫైల్ 

హైదరాబాద్, వెలుగు: జిల్లాకో మెడికల్ కాలేజీలో భాగంగా ఈ ఏడాది మరో 8 ఏర్పాటు చేసేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఖమ్మం, కరీంనగర్‌‌‌‌, ఆసిఫాబాద్‌‌, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఫైల్ ను రాష్ట్ర సర్కార్‌‌ ఆమోదం కోసం పంపించామని డీఎంఈ రమేశ్‌‌రెడ్డి శుక్రవారం చెప్పారు. సర్కార్ ఆమోదం తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్‌‌ (ఎన్ఎంసీ) అనుమతి కోసం పంపించాల్సి ఉంటుంది. అక్టోబర్‌‌‌‌ లేదా నవంబర్‌‌‌‌లో ఎన్‌‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది. అంతా సక్రమంగా జరిగితే 2023–24 అకడమిక్ ఇయర్‌‌‌‌లో కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. 
ప్రస్తుతం పంపిస్తున్న ప్రపోజల్స్‌‌లో ఖమ్మం, కరీంనగర్‌‌‌‌కు కచ్చితంగా పర్మిషన్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్‌‌లో ఉండాల్సిన సౌలతులన్నీ ఖమ్మం, కరీంనగర్‌‌‌‌ హాస్పిటళ్లలో ఉన్నాయని పేర్కొంటున్నారు. మిగిలిన ఆరు జిల్లాల్లో మాత్రం హాస్పిటళ్లను అప్‌‌గ్రేడ్ చేయాల్సి ఉంది. ఇక పోయినేడాది ఎన్ఎంసీకి దరఖాస్తు చేసిన 8 కాలేజీల్లో ఇటీవలే జగిత్యాల మెడికల్ కాలేజీకి పర్మిషన్ వచ్చింది. మంచిర్యాల, రామగుండం, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భ‌‌ద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి  కాలేజీలకు పర్మిషన్ రావాల్సి ఉంది.