V6 News

శామీర్ పేట్ లో 3కిలోల గంజాయి పట్టివేత..ఆరుగురు యువకుల అరెస్ట్

శామీర్ పేట్ లో 3కిలోల గంజాయి పట్టివేత..ఆరుగురు యువకుల అరెస్ట్

యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి అక్రమ రవాణా దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠా ఆట కట్టించారు ఎస్ఓటీ పోలీసులు. పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

శామీర్ పేట్ పరిధిలోని కొల్తూరులో ఒక ఖాళీ మైదానంలో కొంతమంది యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. 13 మంది యువకులు గంజాయి విక్రయించేందుకు  యత్నిస్తుండగా దాడి చేశారు. పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. వారిని వెంబడించి ఆరుగురిని అదుపులోకి పట్టుకున్నారు. వారినుంచి రూ. 2లక్షల విలువైన 3 కిలోల గంజాయి,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్టయిన నిందితులను తుర్కపల్లిలోని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారంతా చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.