భారత్ పాక్ మ్యాచ్ ప్రత్యేకమైందేమీ కాదు

భారత్ పాక్ మ్యాచ్ ప్రత్యేకమైందేమీ కాదు

ఆసియా కప్లో పాత విరాట్ కోహ్లీని చూస్తారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. ఫాంలేమితో సతమతమవుతున్న కోహ్లీ..ఆసియా కప్లో ఫాంలోకి వస్తాడని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. 

సెంచరీలు చేయకపోవచ్చు..
ముందు కోహ్లీని ప్రాక్టీస్ చేయనివ్వండి. కోహ్లీ గొప్ప ఆటగాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో వేల పరుగులు చేశాడు.  కోహ్లీ త్వరలోనే పుంజుకుంటాడు. సెంచరీలు చేయకపోవచ్చు. కానీ ఆసియా కప్లో మునపటి కోహ్లీని చూస్తాం.  అతడు ఈ టోర్నీ ద్వారా ఫామ్ను అందుకుంటాడు.  అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

పరుగులు చేయడానికి తంటాలు..
కోహ్లీ సెంచరీ చేసి మూడేండ్లు అవుతోంది. ఏడాది కాలంగా ఫాం కోల్పోయిన అతను..పరుగులు చేయడానికి తంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత  వరుసగా విఫలమవుతున్న కోహ్లీ.. ఇంగ్లాండ్  సిరీస్ లో విఫలమయ్యాడు. దీంతో  వెస్టిండీస్ టూర్ కు కోహ్లీని బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే విరామం ముగించుకుని ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో  కోహ్లీ ఫ్యాన్స్ విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. సెంచరీ చేయకపోయినా పర్వాలేదు..కనీసం హాఫ్ సెంచరీ చేస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నేను లేను..
ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నానన్న వార్తలపై గంగూలీ స్పందించాడు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశాడు. దానిపై బీసీసీఐ, కేంద్రం నిర్ణయం తీసుకుంటాయని చెప్పాడు.

ప్రత్యేకమైన మ్యాచ్ కాదు..
ఆసియాకప్లో భారత్, పాక్ మ్యాచ్ ప్రత్యేకమైన మ్యాచ్ కాదని గంగూలీ అన్నాడు. ఇది మిగతా మ్యాచుల లాగే సాధారణమైన మ్యాచ్ అని చెప్పాడు. తాను ఆడేసమయంలోనూ సాధారణ మ్యాచ్లాగే చూసేవాడినని చెప్పుకొచ్చాడు. అటు ఆసియా కప్లో భారత్ రాణిస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు. భారత్ పటిష్టంగా ఉందని..టీమిండియాకే గెలుపు అవకాశాలున్నాయని చెప్పాడు.