దాదాకు ఐసీసీనీ నడిపించే సత్తా ఉంది

దాదాకు ఐసీసీనీ నడిపించే సత్తా ఉంది

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ కౌన్సిల్‌‌ (ఐసీసీ)ను నడిపించగలిగే పొలిటికల్‌‌ స్కిల్స్‌‌.. బీసీసీఐ ప్రెసి డెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీలో పుష్కలంగా ఉన్నాయని ఇంగ్లండ్‌‌ మాజీ కెప్టెన్‌‌ డేవిడ్‌‌ గోవర్‌‌ అన్నాడు. దాదా ఏదో ఓ రోజు కచ్చితంగా ఐసీసీని నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘వరల్డ్‌‌ క్రికెట్‌‌లో బీసీసీఐని నడిపించడం టఫ్​ జాబ్‌‌. చాలా అంశాల్లో అపారమైన జ్ఞానం ఉండాలి. ఎన్నో విషయాలు తెలిసుండాలి. మిలియన్ల కొద్దీ అంశాలను కంట్రోల్‌‌ చేయగలిగే సత్తా ఉండాలి. క్రికెట్‌‌లో తనకంటూ ఓ ఇమేజ్‌‌ను సృష్టించుకున్న గంగూలీ.. బీసీసీఐని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అతని రాజకీయ వ్యూహ చతురత కూడా బాగుంది. దీనికితోడు మంచితనం కూడా ఉంది. ఈ తరహా రాజకీయ లక్షణాలే ఐసీసీకి కావాలి. గత కొన్నేళ్లుగా నేను తెలుసుకున్నది ఏంటంటే.. బీసీసీఐని సమర్థంగా నడిపించే వ్యక్తి మాత్రమే ఐసీసీలో సక్సెస్‌‌ కాగలడు’ అని గోవర్‌‌ పేర్కొన్నాడు. ఇండియాలో క్రికెట్‌‌కు ఉన్న ఫాలోయింగ్‌‌ గురించి చెప్పక్కర్లేదన్నాడు. ఓ కంట్రీలో సింగిల్‌‌ స్పోర్ట్‌‌కు ఇంత అభిమానం ఉండటం మంచి పరిణామం అన్నాడు. ‘బీసీసీఐ ప్రెసిడెంట్‌‌గా గంగూలీ చార్జ్‌‌ తీసుకున్నప్పుడు బోర్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటివరకు చాలా వాటిని చాకచక్యంగా పరిష్కరించాడు. ఇది మంచి ఆరంభం. ఎవరు ఏది చెప్పినా వింటాడు. అదే టైమ్‌‌లో అతను చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పేస్తాడు. అడ్మినిస్ట్రేషన్‌‌లో పొలిటికల్‌‌ స్కిల్స్‌‌ చాలా అవసరం. గంగూలీలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తే.. ఐసీసీలోనూ ఉంటే క్రికెట్‌‌ మరింత ముందుకెళ్తుంది’ అని గోవర్‌‌ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్‌‌ జరగకపోతే నాలుగు వేల కోట్లు నష్టం: గంగూలీ

కారణమేదైనా సరే.. ఈ ఏడాది ఐపీఎల్‌‌ నిర్వహించలేకపోతే  తాము రూ.4000 కోట్ల వరకు నష్టపోతామని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ అన్నాడు. ‘ఆర్థికంగా మేం ఎంత నష్టపోతున్నామో చూసుకుని, అన్నీ పరిశీలించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్‌‌ నిర్వహించ లేకపోతే 4000 కోట్ల దాకా నష్టాన్ని భరించాలి.  ఈ ఏడాది ఏదో ఒక టైమ్‌‌లో ఐపీఎల్‌‌ జరిగితే ప్లేయర్లు, ఇతర సిబ్బంది జీతాలు కట్‌‌ చెయ్యం. లేదంటే కోతలు తప్పవు.  ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌‌లు నిర్వహించాలని చాలామంది అంటున్నారు. కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు. గేమ్‌‌కు ఉండే అట్రాక్షన్‌‌ తగ్గుతుంది. అలాగే, పరిమిత సంఖ్యలో ఫ్యాన్స్‌‌ను అనుమతించాలన్నా చాలా ఇబ్బందులు వస్తాయి’ అని దాదా అభిప్రాయపడ్డాడు.

ఆసీస్‌‌తో ఐదో టెస్ట్‌‌ కుదరదు 

ఆస్ట్రేలియా టూర్‌‌లో టీమిండియా అదనంగా మరో టెస్ట్‌‌ ఆడడం కుదరదని గంగూలీ అన్నాడు.‘ఐదు టెస్ట్‌‌లు ఆడడం నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ తర్వాత లిమిటెడ్‌‌ ఓవర్‌‌ గేమ్స్‌‌ ఉన్నాయి. 14 రోజుల క్వారంటైన్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ అంశాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్క మ్యాచ్‌‌ పెరిగితే టూర్‌‌ చాలా రోజులు ఎక్స్‌‌టెండ్‌‌ అవుతుంది’ అని గంగూలీ చెప్పాడు.