సఫారీల హ్యాట్రిక్..113 స్కోరును కాపాడిన బౌలర్లు

సఫారీల హ్యాట్రిక్..113 స్కోరును కాపాడిన బౌలర్లు
  • 4 రన్స్‌‌‌‌ తేడాతో బంగ్లాపై గెలుపు
  • రాణించిన కేశవ్‌‌‌‌, క్లాసెన్​

న్యూయార్క్‌ ‌‌‌: టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో మరో లో స్కోరింగ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ను అలరించింది. మొన్న ఇండియా 119 రన్స్‌‌‌‌ను కాపాడుకుంటే ఇప్పుడు సౌతాఫ్రికా టోర్నీ చరిత్రలోనే అత్యల్ప స్కోరును (113) కాపాడుకొని ఔరా అనిపించింది.  సోమవారం జరిగిన గ్రూప్‌‌‌‌-–డి మ్యాచ్‌‌‌‌లో 4 రన్స్‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌ను ఓడించింది.  హ్యాట్రిక్ విక్టరీతో 6 పాయింట్లతో   సఫారీ టీమ్ సూపర్‌‌‌‌‌‌‌‌–8 బెర్తు ఖాయం చేసుకుంది. తొలుత  సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 113/6 స్కోరు మాత్రమే చేసింది.

హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్‌‌‌‌ హసన్ షకీబ్ (3/18) 3, తస్కిన్ అహ్మద్ (2/19) రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌లో ఓవర్లన్నీ ఆడిన బంగ్లా 109/7 స్కోరుకే పరిమితం అయింది. తౌహిద్ హృదయ్ (37), మహ్ముదుల్లా (20) పోరాడినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహారాజ్ (3/27) మూడు, అన్రిచ్ నార్జ్ (2/17), రబాడ (2/19) రెండేసి వికెట్లతో సౌతాఫ్రికాను 
గెలిపించారు. క్లాసెన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

ఆదుకున్న క్లాసెన్, మిల్లర్

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన సౌతాఫ్రికాకు సరైన ఆరంభం దక్కలేదు. బంగ్లా పేసర్ తంజిమ్ హసన్ షకీబ్‌‌‌‌ సఫారీ టాపార్డర్ నడ్డి విరిచాడు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ రీజా హెండ్రిక్స్ (0)ను డకౌట్‌‌‌‌ చేసి బంగ్లాకు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.  ఓ ఫోర్, రెండు సిక్సర్లతో జోరు మీద కనిపించిన మరో ఓపెనర్ డికాక్ (18)  మూడో ఓవర్లో తంజిమ్‌‌‌‌ బాల్‌‌‌‌ను వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ (4)ను తస్కిన్ అహ్మద్ క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయగా.. మూడు బాల్స్‌‌‌‌ తర్వాత ట్రిస్టాన్ స్టబ్స్ (0)ను తంజిమ్ డకౌట్‌‌‌‌ చేశాడు.

దాంతో సౌతాఫ్రికా 23/4తో  కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌‌‌‌లో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన మిల్లర్‌‌‌‌‌‌‌‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను ఆదుకున్నారు.  బంగ్లా బౌలర్లు జోరుమీద ఉండటంతో తొలుత  జాగ్రత్తగా ఆడారు. మిల్లర్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్ రొటేట్‌‌‌‌ చేయగా.. క్లాసెన్ వీలు చిక్కినప్పుడల్లా  బౌండ్రీలు కొట్టాడు. రిషద్ హుస్సేన్ (1/32) వేసిన పదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో స్పీడు అందుకున్నాడు. అయినా బంగ్లా పొదుపుగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముస్తాఫిజుర్ (0/18) వేసిన 14వ ఓవర్లో మిల్లర్  సిక్స్‌‌‌‌, మహ్ముదుల్లా  (0/17)బౌలింగ్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌ సిక్స్ రాబట్టడంతో 17  ఓవర్లకు సఫారీల స్కోరు వంద దాటింది.

మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన తస్కిన్ అహ్మద్‌‌‌‌ క్లాసెన్‌‌‌‌ను బౌల్డ్‌‌‌‌ చేయడంతో  ఐదో వికెట్‌‌‌‌కు  79 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. 19వ ఓవర్లో మిల్లర్‌‌‌‌‌‌‌‌ కూడా బౌల్డ్ అవ్వడంతో సౌతాఫ్రికా 106/7తో నిలిచింది. చివరి మూడు ఓవర్లలో  13 రన్స్ మాత్రమే రావడంతో సఫారీ టీమ్ కనీసం 120 మార్కు కూడా దాటలేకపోయింది. 

కేశవ్ కేక

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో బంగ్లాదేశ్ సైతం తడబడగా.. పేసర్లు రబాడ, అన్రిచ్‌‌‌‌కు తోడు స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసి బంగ్లాకు బ్రేకులు వేశాడు.  తొలి ఓవర్లో మార్కో జాన్సన్‌‌‌‌ ఒకే రన్ ఇవ్వగా.. తన బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ తంజిద్  హసన్ (9)ను ఔట్‌‌‌‌ చేసిన రబాడ సఫారీలకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. దాంతో మరో ఓపెనర్ నజ్ముల్ శాంటో (14), వన్‌‌‌‌డౌన్ బ్యాటర్ లిటన్ దాస్ (9 ) జాగ్రత్త పడ్డారు. నాలుగో ఓవర్లో బార్ట్‌‌‌‌మన్‌‌‌‌కు శాంటో సిక్స్‌‌‌‌తో స్వాగతం పలికినా తర్వాత నెమ్మదించడంతో పవర్ ప్లేలో బంగ్లా 29/1తో నిలిచింది.

ఫీల్డింగ్ మారిన తర్వాత బౌలింగ్‌‌‌‌కు వచ్చిన స్పిన్నర్ కేశవ్‌‌‌‌ మహారాజ్ తొలి బాల్‌‌‌‌కే లిటన్‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌ చేర్చాడు. ఆపై అన్రిచ్ నార్జ్ తన వరుస ఓవర్లలో షకీబ్ అల్ హసన్ (3), శాంటోను వెనక్కుపంపడంతో బంగ్లా సగం ఓవర్లకు 50/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌లో తౌహిద్, మహ్ముదుల్లా ధాటిగా ఆడుతూ   ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నారు. తౌహిద్ రెండు సిక్సర్లు, మహ్ముదుల్లా రెండు ఫోర్లు కొట్టి టీమ్‌‌‌‌ను రేసులోకి తెచ్చారు. సఫారీ బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నా వీళ్లు వెనక్కు తగ్గలేదు. 24 బాల్స్‌‌‌‌లో 27 రన్స్‌‌‌‌ అవసరమైన దశలో బార్ట్‌‌‌‌మన్‌‌‌‌ వేసిన 17వ ఓవర్లో ఫోర్ కొట్టిన తౌహిద్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌ తగ్గించాడు.

కానీ, తర్వాతి ఓవర్లో తొలి బాల్‌‌‌‌కే అతడిని ఎల్బీ చేసిన రబాడ ఐదో వికెట్‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్‌‌‌‌ చేశాడు. ఆ ఓవర్లో ఒకే రన్‌‌‌‌ ఇచ్చి సౌతాఫ్రికాను రేసులోకి తెచ్చాడు. దాంతో బంగ్లా విజయ సమీకరణం 12 బాల్స్‌‌‌‌లో 18 రన్స్‌‌‌‌గా మారింది. 19వ ఓవర్లో బార్ట్‌‌‌‌మన్‌‌‌‌ ఏడు రన్స్‌‌‌‌ ఇచ్చాడు. చివరి ఓవర్లో 11 రన్స్‌‌‌‌ కాపాడేందుకు వచ్చిన స్పిన్నర్ కేశవ్‌‌‌‌ మహారాజ్.. కెప్టెన్‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌లతో మూడో బాల్‌‌‌‌కు జాకెర్ అలీ (8), ఐదో బాల్‌‌‌‌కు మహ్మదుల్లాను ఔట్‌‌‌‌ చేసి ఆరు  పరుగులే ఇచ్చి సఫారీలను గెలిపించాడు.