World Cup 2025 Final: బౌలర్లదే భారం: షెఫాలీ, దీప్తి హాఫ్ సెంచరీలు.. ఫైనల్లో సౌతాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

World Cup 2025 Final: బౌలర్లదే భారం: షెఫాలీ, దీప్తి హాఫ్ సెంచరీలు.. ఫైనల్లో సౌతాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించింది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని  డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసి సౌతాఫ్రికాకు ఛాలెంజ్ విసిరింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87)తో పాటు మిడిల్ ఆర్డర్ లో దీప్తి శర్మ(58) హాఫ్ సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా మూడు వికెట్లు పడగొట్టింది. ట్రయిన్, నాడిన్ డి క్లెర్క్, నాన్కులులేకో తలో వికెట్ తీసుకున్నారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియాకు ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత బ్యాట్ ఝులిపించారు. సఫారీ బౌలర్లను అలవోకగా ఆడుతూ స్వేచ్ఛగా బౌండరీలు రాబట్టారు. ఈ క్రమంలో వెరీ భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. తొలి వికెట్ కు 104 పరుగులు జోడించిన తర్వాత 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మందాన ఔటైంది. స్మృతి ఔటైనా జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 
రెండో వికెట్ కు 62 పరుగులు జోడించి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 

భారీ స్కోర్ ఖాయమన్న దశలో షెఫాలీ (87), జెమీమా (24) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో ఇండియా 171 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కౌర్, దీప్తి శర్మ కలిసి టీమిండియాను ముందుకు తీసుకెళ్లారు. జాగ్రత్తగా ఆడుతూ చిన్నగా స్కోర్ బోర్డును ముందుకు కదిపారు. నాలుగు వికెట్ కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు. క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బందిపడిన హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు చేసి పెవిలియన్ కు చేరింది. ఓ వైపు వికెట్లకు పడుతున్నా దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. చివర్లో రిచా ఘోష్ బౌండరీలతో హోరెత్తించడంతో ఇండియా స్కోర్ 298 పరుగులకు చేరుకుంది.