నేటి నుంచి సౌతాఫ్రికాతో ఇండియా థర్డ్‌ టెస్ట్‌

నేటి నుంచి సౌతాఫ్రికాతో ఇండియా థర్డ్‌ టెస్ట్‌

కేప్‌‌‌‌ టౌన్‌‌: సెంచూరియన్‌‌లో హిస్టారికల్‌‌ విక్టరీ సాధించి.. జొహన్నెస్‌‌బర్గ్‌‌లో బోల్తా కొట్టిన టీమిండియా.. కేప్‌‌టౌన్‌‌ సవాల్‌‌కు రెడీ అయింది.  సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌‌ గెలిచే  ఈ చివరి చాన్స్‌‌ను అస్సలు వదులుకోకూడదని భావిస్తోంది. సఫారీలతో మూడు టెస్టుల సిరీస్‌‌లో భాగంగా మంగళవారం ఇక్కడి న్యూలాండ్స్‌‌ స్టేడియంలో మొదలయ్యే ఆఖరి టెస్టులో గెలిచి హిస్టరీ క్రియేట్‌‌ చేయాలని ఆశిస్తోంది. బ్యాక్‌‌ పెయిన్‌‌ కారణంగా సెకండ్‌‌ టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ ఫుల్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించి మ్యాచ్‌‌కు రెడీ అవడంతో ఇండియా బలం పెరిగింది. రెండు జట్లూ చెరో టెస్టు గెలిచిన ఈ సిరీస్‌‌ ప్రస్తుతం 1–1తో ఈక్వల్‌‌గా ఉండగా.. ఎలాగైనా సరే కేప్‌‌టౌన్‌‌లో సఫారీలను పడగొట్టాలని కెప్టెన్‌‌ విరాట్‌‌ ఆశిస్తున్నాడు. మరోవైపు సెకండ్‌‌ టెస్టులో విక్టరీ జోష్‌‌ను కేప్‌‌టౌన్‌‌లోనూ కంటిన్యూ చేయాలని డీన్‌‌ ఎల్గర్‌‌ కెప్టెన్సీలోని సఫారీ టీమ్‌‌ కోరుకుంటోంది. ఇక, ఇక్కడ ఆడిన ఐదు టెస్టుల్లో ఇండియా ఒక్కటి కూడా నెగ్గలేదు.  మూడింటిలో ఓడి రెండు మ్యాచ్‌‌లను డ్రా చేసుకుంది.

విరాట్‌‌పై ప్రెజర్‌‌
కోహ్లీకి ఇది 99వ టెస్టు. ఈ  మ్యాచ్‌‌ స్టార్ట్‌‌ అవుతున్న రోజు అతని ముద్దుల కూతురు వామిక పుట్టిన రోజు కావడం విశేషం. ఇలాంటి ప్రత్యేక సందర్భంలోనూ అతనిపై చాలా ప్రెజర్‌‌ ఉంది. దాదాపు రెండేళ్లుగా తను బ్యాట్‌‌తో అంతగా రాణించకపోవడం, వన్డే కెప్టెన్సీ వివాదమే ఇందుకు కారణం. దాంతో, విరాట్‌‌ ఇప్పుడు  కెప్టెన్‌‌గానే కాకుండా బ్యాటర్‌‌గా టీమ్‌‌ను ముందుండి నడించాల్సిన అవసరం ఏర్పడింది. సౌతాఫ్రికాతో తొలి సిరీస్‌‌ గెలిచిన కెప్టెన్‌‌గా హిస్టరీ క్రియేట్‌‌ చేస్తే ప్రెజర్‌‌తో పాటు ఆటేతర విషయాల నుంచి కూడా తనకు రిలీఫ్​ లభిస్తుంది. అది జరగాలంటే ముందుగా తనలోని వరల్డ్‌‌ బెస్ట్‌‌ బ్యాటర్‌‌ను కోహ్లీ నిద్రలేపాల్సిందే. మరీ ముఖ్యంగా తన ఆఫ్‌‌స్టంప్‌‌ వీక్‌‌నెస్ నుంచి బయటపడాలి. ఔట్‌‌సైడ్‌‌ ఆఫ్‌‌ స్టంప్‌‌ మీదుగా వస్తున్న బాల్స్‌‌ను ఆఫ్‌‌–డ్రైవ్‌‌ లేదా తనకిష్టమైన కవర్‌‌ డ్రైవ్‌‌ ఆడే ప్రయత్నంలోనే కోహ్లీ క్యాచ్‌‌ ఔట్‌‌ అవుతున్నాడు. కాబట్టి పెద్ద స్కోరు చేసేంత వరకూ కోహ్లీ ఈ షాట్లు ఆడకుండా ఉంటే మంచిది. 2004 సిడ్నీ టెస్టులో డబుల్‌‌ సెంచరీ చేసేంత వరకూ బ్రెట్‌‌లీ బౌలింగ్‌‌లో సచిన్‌‌ ఒక్క ఆఫ్‌‌ సైడ్‌‌ షాట్‌‌ ఆడలేదు. అయితే, ఆదివారం జరిగిన టీమ్‌‌ ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో కోహ్లీ ఎక్కువగా కవర్‌‌ డ్రైవ్స్‌‌ కొడుతూ కనిపించాడు. మరి, మ్యాచ్‌‌ టైమ్‌‌లో ఏం చేస్తాడో చూడాలి. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌‌లో ఫిఫ్టీలు చేసిన  సీనియర్‌‌ బ్యాటర్లు పుజారా, రహానె గాడిలో పడ్డట్టే అనిపిస్తోంది. అయితే, టీమ్‌‌లో తమ ప్లేస్‌‌లు ఇంకొంతకాలం నిలబెట్టుకోవాలంటే ఇద్దరూ భారీ ఇన్నింగ్స్‌‌లు బాకీ ఉన్నారు. ఓపెనర్లు రాహుల్‌‌, మయాంక్‌‌ కూడా మంచి పునాది వేయాల్సిన అవసరం ఉంది. ఇక, రెండు మ్యాచ్‌‌ల్లోనూ నిర్లక్ష్యమైన షాట్లు ఆడి ఔటైన పంత్‌‌ తన మైండ్‌‌ సెట్‌‌ మార్చుకోవాలి.ఈ విషయంలో కోచ్‌‌ ద్రవిడ్‌‌, కెప్టెన్‌‌ కోహ్లీ తనకు క్లాస్‌‌ తీసుకున్నారు. ఆసీస్‌‌, ఇంగ్లండ్‌‌లో అద్భుతంగా ఆడిన పంత్‌‌  సిచ్యువేషన్‌‌, జట్టు అవసరాలకు తగ్గట్టుగా బ్యాటింగ్‌‌ చేయాలి.  ఇక, కోహ్లీ రావడంతో మిడిలార్డర్‌‌ బ్యాటర్‌‌ హనుమ విహారి బెంచ్‌‌కు పరిమితం కాకున్నాడు. తొడకండరాల గాయం నుంచి సిరాజ్‌‌ ఇంకా కోలుకోలేదని కెప్టెన్‌‌ చెప్పాడు. అతని ప్లేస్‌‌లో సీనియర్‌‌ పేసర్‌‌ ఇషాంత్‌‌ టీమ్‌‌లోకి రావడం ఖాయమే. తన బౌలింగ్‌‌కు సూటయ్యే న్యూలాండ్స్‌‌ వికెట్‌‌పై లంబూ నుంచి టీమ్‌‌ చాలా ఎక్స్‌‌పెక్ట్‌‌ చేస్తోంది. సెకండ్‌‌ టెస్టులో 8 వికెట్లతో చెలరేగిన శార్దూల్‌‌ అదే జోరు కొనసాగించి.. షమీ, బుమ్రా కూడా రాణిస్తే బౌలింగ్‌‌లో టీమ్‌‌కు తిరుగుండదు.

జోష్‌‌‌‌లో సఫారీలు
సెకండ్‌‌ టెస్టు విక్టరీతో సౌతాఫ్రికా ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. కెప్టెన్‌‌ డీన్‌‌ ఎల్గర్‌‌, బవూమకు తోడు కీగన్‌‌ పీటర్సన్‌‌, డుసెన్‌‌ కూడా బ్యాటింగ్‌‌లో ఇంప్రూవ్‌‌ అవడంతో ఆ టీమ్‌‌ బలం పెరిగింది. ఫస్ట్‌‌ టెస్టు ఓటమి తర్వాత సీనియర్‌‌ ప్లేయర్‌‌ డికాక్‌‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌‌ ప్రకటించినా.. జొహన్నెస్‌‌బర్గ్‌‌లో ఒక్క టెస్టు నెగ్గిన హిస్టరీ లేకపోయినా కూడా సఫారీలు గొప్పగా ఆడి గెలిచారు. ముఖ్యంగా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఇండియాను తక్కువ స్కోరుకు ఆలౌట్‌‌ చేయడంలో బౌలర్లు రబాడ, జాన్సెన్‌‌, ఒలివర్‌‌ విజయానికి బాటలు వేశారు. అదే ఊపును థర్డ్​ టెస్టులోనూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. పైగా, న్యూలాండ్స్‌‌ స్టేడియంలో హోమ్‌‌టీమ్‌‌కు మంచి రికార్డు  ఉంది. ఇక్కడ ఆడిన ఏడు టెస్టుల్లో కేవలం ఒక్కదాంట్లోనే ఓడిపోయింది. ఇక్కడి వికెట్‌‌పై పేస్‌‌తో పాటు ఎక్కువ బౌన్స్‌‌ లభిస్తుంది. స్టేడియానికి ఒకవైపు మొత్తం టేబుల్‌‌ మౌంటేన్‌‌ ఉండటంతో పిచ్‌‌ పాస్ట్‌‌ బౌలర్లకు బాగా సపోర్ట్‌‌ చేస్తుంది. హోమ్‌‌టీమ్‌‌ పేసర్లకు ఇక్కడి కండీషన్స్‌‌ బాగా అలవాటు. కాబట్టి సఫారీ పేసర్ల నుంచి  కోహ్లీసేన సవాల్​ తప్పదు.