చెత్త ఫీల్డింగ్తో గెలిచే మ్యాచ్లో ఓడిన టీమిండియా

చెత్త ఫీల్డింగ్తో గెలిచే మ్యాచ్లో ఓడిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు..19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించారు. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లతో టీమిండియాను కోలుకోలేని దెబ్బతీసిన ఎంగిడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

టప టపా...

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా... భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.  23 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ  ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకుంది. మరోసారి నిరాశపరుస్తూ కేఎల్ రాహుల్ ఎంగిడి బౌలింగ్లో మార్కరమ్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి మాంచి టచ్లో కనిపించిన విరాట్ కోహ్లీ సైతం.. ఫుల్ షాట్ ఆడి.. బౌండరీ లైన్ దగ్గర రబాడాకు చిక్కాడు.

కోహ్లీ తర్వాత వచ్చిన దీపక్ హుడా ఎక్కువ సేపు క్రీజులో  నిలబడలేకపోయాడు. నోర్ట్జే బౌలింగ్లో డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా 42 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో సూర్యకుమార్కు హార్దిక్ పాండ్యా జతకలిశాడు. వీరిద్దరు జట్టును ఆదుకుంటారని అనుకున్నారు. కానీ ఎంగిడి మరోసారి దెబ్బ తీశాడు.  కోహ్లీ లాగే బంతిని ఆడబోయిన హార్దిక్..రబాడాకే చిక్కాడు. దీంతో  భారత్ ఖాతాలో 50 పరుగులు చేరకుండానే సగం వికెట్లు కోల్పోయింది. 

రాణించిన సూర్య..

కేఎల్ రాహుల్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 40 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 15 పరుగులు, కోహ్లీ 12 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగతా వారు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి నాలుగు వికెట్లు పడగొట్టగా పార్నెల్ 3 వికెట్లు తీసుకున్నాడు. నోర్ట్జేకు ఒక వికెట్ దక్కింది.

అర్షదీప్ సింగ్ అదుర్స్..

స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు అర్షదీప్ సింగ్ షాకిచ్చాడు. రెండో ఓవర్లలోనే  డికాక్, రోసోలను ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కెప్టెన్ బవుమాను షమీ బుట్టలో వేసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఆదుకున్న మార్కరమ్, మిల్లర్..

ఈ సమయంలో వైస్ కెప్టెన్ మార్కరమ్, మిల్లర్ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు ఇద్దరు 76 పరుగులు జోడించారు. ముఖ్యంగా మార్కరమ్ రెచ్చిపోయి ఆడాడు. మొదట్లో తడబడ్డా..క్రీజులో కుదుర్కొన్నాక తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 41 బంతుల్లో 1 సిక్సు, 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. మార్కరమ్ ఔటైనా మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్గా నిలవడంతో సౌతాఫ్రికా చివరకు 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి గెలుపొందింది. 

చెత్త ఫీల్డింగ్తో గెలిచే మ్యాచ్లో ఓటమి..

ఈ మ్యాచ్ లో టీమిండియా చెత్త ఫీల్డింగ్ చేసింది. ఓ దశలో  సౌతాఫ్రికా 10 ఓవర్లలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న మార్కరమ్, మిల్లర్ జోడి డిఫెన్స్ కే పరిమితమైంది. అయితే ఈ  జంటను విడదీసేందుకు టీమిండియాకు అనేక అవకాశాలొచ్చాయి. కానీ  చెత్త ఫీల్డింగ్‌తో వాటిని చేజార్చుకుంది. మొత్తం మూడు రనౌట్లు.. రెండు క్యాచ్‌లు నేలపాలు చేశారు. రోహిత్ శర్మ రెండు సునాయాస రనౌట్లు మిస్ చేశాడు.  సూర్య ఒక రనౌట్ అవకాశాన్ని చేజార్చాడు. కోహ్లీ అయితే చేతిలోకి వచ్చిన లడ్డులాంటి క్యాచ్ ను జారవిడిచాడు. మరో క్యాచ్‌ను హార్దిక్ -కోహ్లీ సమన్వయ లోపంతో నేలపాలు చేశారు.  ఈ అవకాశాలను క్యాష్ చేసుకున్న మార్క్‌రమ్ -మిల్లర్.. టీమిండియా బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ..అర్థ సెంచరీలు చేశారు. జట్టును గెలిపించారు.