రూసో సెంచరీ...సౌతాఫ్రికా సూపర్ విక్టరీ

రూసో సెంచరీ...సౌతాఫ్రికా సూపర్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్లో సౌతాఫ్రికా ఎట్టకేలకు బోణి కొట్టింది. బంగ్లాదేశ్పై 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల టార్గెట్ను ఛేదించలేక..బంగ్లా కేవలం 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. 

రూసో సెంచరీ...
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓ దశలో 7 పరుగులకే సౌతాఫ్రికా తొలి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్  టెంబా బావుమా 2 పరుగులు చేసి  తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో  పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో డికాక్ కు రోసో జతకలిశాడు. వీరిద్దరు బంగ్లా బౌలర్లను ఉతికారేశారు. ఇదే క్రమంలో రూసో 56 బంతుల్లో 8 సిక్స్ లు, 7 ఫోర్లతో 109 పరుగులు చేయగా.. డికాక్ 38 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్లతో 63 పరుగులు సాధించాడు. వీరిద్దరి ధాటికి.. దక్షిణాఫ్రికా మరింత భారీ స్కోర్ చేస్తుందనిపించింది. అయితే చివర్లో ప్రొటీస్ టీమ్ వెంటవెంటనే వికెట్లను కోల్పోవడంతో అనుకున్న దాని కంటే తక్కువ స్కోరు చేసింది.  బంగ్లా బౌలర్లలో షకీబుల్ హసన్ 2 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మహుముద్, హస్సేన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 

దాస్ ఒక్కడే...
206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్...సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా టార్గెట్ ఛేజింగ్ లో బంగ్లా బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు.  15 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ నట్రోజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. లిట్టన్ దాస్ ఒక్కడే పోరాడాడు. అయితే అతనికి సహకరించేవారు కరువయ్యారు.  కెప్టెన్ షకీబుల్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా.. హుస్సేన్ కూడా 1 పరుగే చేశాడు. లిట్టన్ దాస్ 31 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్ తో 34 పరుగులు సాధించాడు.  సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే 4 వికెట్లు తీశాడు. శంసి3  వికెట్లు పడగొట్టగా.. రబాడ, మక్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.