సౌతాఫ్రికా అదుర్స్..​ ఇంగ్లండ్​పై 7రన్స్​ తేడాతో గెలుపు

సౌతాఫ్రికా అదుర్స్..​ ఇంగ్లండ్​పై 7రన్స్​ తేడాతో గెలుపు

గ్రాస్‌‌‌‌ ఐలెట్‌‌‌‌: టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో టాప్ గేర్‌‌లో దూసుకెళ్తున్న సౌతాఫ్రికా దాదాపుగా సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకుంది. చిన్న టార్గెట్‌‌‌‌ను బౌలర్లు అద్భుతంగా కాపాడటంతో.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 7 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 163/6 స్కోరు చేసింది. డికాక్‌‌‌‌ (38 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 65), డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 43) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. 

ఫస్టాఫ్‌‌‌‌ మొత్తం ఓవర్‌‌‌‌కు 10 రన్స్‌‌‌‌కు పైగా రాబట్టి డికాక్‌‌‌‌ ఇచ్చిన ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌‌‌‌ (3/40) కీలక వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నాడు. తొలి వికెట్‌‌‌‌కు 86 రన్స్‌‌‌‌ జోడించి హెండ్రిక్స్​ (19) ఔటవగా..  క్లాసెన్‌‌‌‌ (8), మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (1), మార్కో జాన్సెన్‌‌‌‌ (0) నిరాశ పరిచారు. మధ్యలో మిల్లర్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌) ఐదో వికెట్‌‌‌‌కు 42 రన్స్‌‌‌‌ జత చేయడంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది. 

తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ 20 ఓవర్లలో 156/6 స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్‌‌‌‌ (53) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా నిలిచాడు. 61 రన్స్‌‌‌‌కే ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (11), బట్లర్‌‌‌‌ (17), బెయిర్‌‌‌‌స్టో (16), మొయిన్‌‌‌‌ అలీ (9) ఔటైనా.. బ్రూక్, లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ (33) ఐదో వికెట్‌‌‌‌కు 78 రన్స్‌‌‌‌ జోడించి మ్యాచ్‌‌‌‌ను మలుపు తిప్పారు.  కానీ18వ ఓవర్లో లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేసిన రబాడ (2/32) గేమ్‌‌‌‌ను తమ వైపుకు తీసుకెళ్లాడు. సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ (10 నాటౌట్‌‌‌‌) పోరాడినా.. రబాడ, అన్రిచ్  (1/35) అద్భుతమైన బౌలింగ్‌‌‌‌తో సఫారీ జట్టును గట్టెక్కించారు. డికాక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.