సినీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేలా..

సినీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేలా..

దక్షిణ భారత సినిమా నిర్మాతలంతా ఏకమై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌‌ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఓసారి సమావేశం కాగా,  రెండో సమావేశం ఆదివారం హైదరాబాద్‌‌లో నిర్వహించారు. 

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతల మండళ్లు, గిల్డ్స్,  వివిధ ప్రతినిధి సంస్థల ముఖ్య సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  దక్షిణ భారత సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ, పరిశ్రమలో స్థిరత్వం తీసుకురావడం వంటి అంశాలపై  చర్చలు జరిగాయి.

ముఖ్యంగా పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు, థియేట్రికల్ ఎగ్జిబిషన్ వ్యవస్థలో మార్పులు,  ఓటీటీ  విండోయింగ్ విధానాలు, వర్క్‌‌ఫోర్స్ సమన్వయం, ఫిల్మ్ ఫైనాన్సింగ్ స్థిరత్వం వంటి కీలక అంశాలు సమావేశంలో ప్రధాన చర్చా విషయాలుగా నిలిచాయి.

ఇక తమ అసోసియేషన్   తదుపరి సమావేశాన్ని జూన్ 14న కొచ్చిలో నిర్వహించాలని నిర్ణయించారు.  ఆ సమావేశంలో పరిశ్రమకు సంబంధించిన మరిన్ని నిర్మాణాత్మక చర్చలు, సమిష్టి కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు స్టీరింగ్ కమిటీ వెల్లడించింది.