భారత స్టాక్ మార్కెట్ను దాటేసిన దక్షిణ కొరియా..రూ.420 లక్షల కోట్లకు మార్కెట్క్యాప్

భారత స్టాక్ మార్కెట్ను దాటేసిన దక్షిణ కొరియా..రూ.420 లక్షల కోట్లకు మార్కెట్క్యాప్

న్యూఢిల్లీ: ఏఐ చిప్స్ తయారీ కంపెనీల దూకుడుతో దక్షిణ కొరియా ఈక్విటీ మార్కెట్ మనదేశాన్ని అధిగమించింది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద మార్కెట్​గా ఎదిగింది. బ్లూమ్‌‌‌‌బెర్గ్ డేటా ప్రకారం కొరియా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 86 శాతం పెరిగి 5 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.420 లక్షల కోట్లు) దాటింది. భారత మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.403 లక్షల కోట్లు) తగ్గడం గమనార్హం. శామ్‌‌‌‌సంగ్ ఎలక్ట్రానిక్స్ , ఎస్కే హైనిక్స్  కంపెనీలు ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.84 లక్షల కోట్లు) విలువ గల క్లబ్‌‌‌‌లో చేరాయి. 

ఈ కంపెనీలు ఏఐ మెమరీ చిప్స్‌‌‌‌లో తమ ఆధిపత్యంతో కొరియా ఈక్విటీ మార్కెట్ వృద్ధికి కారణమయ్యాయి. ఈ ఏడాది దక్షిణ కొరియా ఇండెక్స్​కోస్పీ 100 శాతానికి పైగా పెరిగి కెనడా, జర్మనీ, యూకే, ఫ్రారాన్స్ దేశాలను దాటేసింది. రూపాయి బలహీనపడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) రికార్డు స్థాయిలో నిధులు ఉపసంహరించుకోవడం, ఏఐ మౌలిక సదుపాయాలతో నేరుగా సంబంధం ఉన్న కంపెనీలు లేకపోవడం భారత మార్కెట్ పతనానికి కారణమయ్యాయి.  

ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారత ఎకానమీ పరిమాణం 4.15 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.348 లక్షల కోట్లు) కాగా, కొరియాది1.93 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.162 లక్షల కోట్లు) ఉంది. ఇటీవల తైవాన్​ సైతం ఇండియా స్టాక్​ మార్కెట్​ను అధిగమించిన విషయం తెలిసిందే. అక్కడి ఏఐ చిప్​ కంపెనీలూ భారీ వృద్ధి సాధించడమే ఇందుకు కారణం.