లైవ్ స్ట్రీమ్‌లో కొరియన్ మహిళా యూట్యూబర్‌కు వేధింపులు

లైవ్ స్ట్రీమ్‌లో కొరియన్ మహిళా యూట్యూబర్‌కు వేధింపులు

కొరియన్ మహిళా యూట్యూబర్ పై వేధింపులకు పాల్పడిన ఇద్దరు యువకులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఆ మహిళను యువకులు చేయి పట్టుకొని బైక్ వద్దకు లాక్కొని వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో యూట్యూబర్ నోనో అని అరుస్తున్నా.. ఓ యువకుడు ఆమె చేయి పట్టుకొని లాక్కొని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. వారు లిఫ్ట్ ఇస్తామని చెబుతూ బైక్ వద్దకు తీసుకెళ్లగా, నిరాకరించిన ఆమె తన ఇల్లు సమీపంలోనే ఉందని వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్పడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియోను రీట్వీట్ చేసిన ఆ యూట్యూబర్ గత రాత్రి తాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ యువకుడు తనను వేధించాడని వాపోయింది. అయితే అతని పక్కనే ఇంకో వ్యక్తి ఉండడంతో పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది. అయితే తాను స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారని, దీంతో స్ట్రీమింగ్ గురించి ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు వారంతట వారే  కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డ ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.